YS Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరు కాలేదు. సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు పులివెందుల నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన ఉదయం పది గంటల సమయంలో సీబీఐ విచారణకు బయలుదేరారు. అయితే అదే సమయంలో ఆయనకు పులివెందుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆయన తల్లి అనారోగ్యంతో పులివెందుల ఆస్పత్రిలో చేరారన్న సమాచారం వచ్చింది. దీంతో ఆయన సీబీఐ విచారణకు రాలేనని.. తన తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో పులివెందులకు వెళ్తున్నానని సీబీఐ అధికారులకు లేఖ రాసి .. హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారు. ఆయన పులివెందుల వెళ్తున్నారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. అయితే అవినాష్ రెడ్డి రాసిన లేఖ విషయంలో సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించలేదు. అవినాష్ రెడ్డి తీరుపై సీబీఐ సీరియస్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. 


Also Read: అన్నయ్య! అన్నమయ్య డ్యామ్‌ ఎప్పుడు? ఉదయాన్నే వైసీపీకి టాస్క్ ఫిక్స్ చేసిన పవన్


మరో వైపు సీబీఐ కోర్టు వద్ద అవినాష్ రెడ్డి అనచరులు మీడియా ప్రతినిధులపై దాడులు చేశారు. అవినాష్ రెడ్డి విచారణకు వస్తారని తెలియడంతో పలువురు మీడియా సంస్థల ప్రతినిధులు వచ్చారు. అక్కడకు పెద్ద ఎత్తున పులివెందుల నుంచి వచ్చిన అవినాష్ రెడ్డి అనుచరులు కూడా గుమికూడారు. అవినాష్ రెడ్డి రావడం లేదని విషయం తెలిసిన తర్వాత మీడియా కవరేజీ ఇస్తున్న వాహనాలపై దాడి చేశారు. ఓ తెలుగు మిడియా చానల్ వాహనాన్ని.. కెమెరాలను ధ్వంసం చేశారు. ఇద్దరు ప్రతినిధుల్ని కూడా గాయపరిచారు. 


మరో వైపు  సీబీఐ అధికారులు కూడా వెంటనే పులివెందుల చేరుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఓ సీబీఐ బృందం కడపలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది.  సాయంత్రంలోపు పులివెందులలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని పులివెందులలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అరెస్ట్ చేస్తారనే భయంతోనే అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావడం లేదని చెబుతున్నారు. మూడు రోజుల కిందట కూడా వ్యక్తిగత కారణాల పేరు చెప్పి విచారణకు  హాజరు కాలేదు.. వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా ఊరట లభించలేదు. విచారణకు రాలేదు. 


అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐకి చట్ట పరమైన అడ్డంకులు ఏమీ లేవు. అయితే అవినాష్ రెడ్డిని ఇతర నిందితుల్ని అరెస్ట్ చేసినట్లుగా చేయలేదు.  అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తెల్లవారుజామునే ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. కానీ అవినాష్ రెడ్డి విషయంలో నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తున్నారు. ఖచ్చితంగా అరెస్ట్ చేసి విచారణ జరిపితే వివరాలు తెలుస్తాయని కోర్టులో సీబీఐ చెప్పింది. అయినా వ్యూహాత్మకంగానే అరెస్ట్ చేయలేదన్న వాదన వినిపిస్తోంది.  విచారణకు పిలిచినప్పుడల్లా రాకపోతూండటంతో.. ఆయన విచారణకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు చెబుతోంది. అయినప్పటికీ అవినాష్ రెడ్డి  రకరకాల కారణాలతో డుమ్మా కొడుతున్నారు.     


Also Read: ఓ వైపు లోకేష్ - మరో వైపు చంద్రబాబు ! ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశమే హైలెట్ అవుతోందా ?