వైసీపీ ప్రభుత్వంపై వరుసగా ట్వీట్లతో చెలరేగిపోతున్నారు. పాపం పసివాడు అంటూ మొన్న ట్వీట్ చేసిన ఆయన... జగన్ చేస్తోంది క్యాష్ వార్ అంటూ నిన్న మరో విమర్శ చేశారు. ఇప్పుడు బాధ్యులే బాధితుల్లా మాట్లాడుతున్నారేంటని ఆశ్చర్యపోతూ మరో ట్వీట్ చేశారు. ఈసారి 2021 వరదలకు కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యామ్ సమస్యలను తెరపైకి తీసుకొచ్చారు. అస్మదీయులకు ప్రాజెక్టు కట్టబెట్టినా నేటికి కూడా పనులు పూర్తి కాలేదని ఎద్దేవా చేస్తూ వరుస ట్వీట్లు పెట్టారు.
2021 నవంబర్ 19న జల విలయానికి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని... ఈ దుర్ఘటనలో 23 మంది చనిపోయారను 22 వేల ఎకరాల్లో పంట మునిగిందని గుర్తు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అప్పట్లో ఘటనపై రియాక్ట్ అయిన ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చిందని ఓ వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. బాధితులకు మూడు నుంచి ఆరు నెలల్లో ఇళ్లు కట్టిస్తామని..అన్నమయ్య డ్యామ్ పునర్‌నిర్మిస్తామని చెప్పినట్టు వీడియోలో వివరించారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు ఓ హైపవన్ కమిటీ కూడా వేస్తున్నట్టు గుర్తు చేశారు.
ప్రమాద ఘటన జరిగిన నేటి 18 నెలలు గడుస్తున్నా బాధితులకు ఎదురు చూపులు.. రైతులకు ఎండమావులే అంటూ స్టేట్‌మెంట్‌తో కూడిన వీడియో వదిలారు. మాటలు మిన్న.. ఫలితాలు సున్నా అంటూ ఎద్దేవా చేశారు. దీంతోపాటు వరుస ట్వీట్‌లు కూడా చేశారు.
అసెంబ్లీలో ఏపీ సీఎం అన్నమయ్య డ్యామ్ ప్రమాదంపై మాట్లాడుతూ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన హై లెవెల్ కమిటీ వేస్తున్నాము ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారన్నారు. మరి ఆ కమిటీ ఏమైందో వారు రాష్ట్రంలోని మిగతా డ్యాములకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ సూచనలు చెప్పారో , AP CM ఏ చర్యలు తీసుకున్నారు ఆ దేవుడికే ఎరుక అంటూ విమర్శించారు.
రాజ్యసభలో కేంద్ర జలవనురుల శాఖ మంత్రి షకావత్ మాట్లాడుతూ అన్నమయ్య డ్యామ్ ప్రమాదం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారన్నారు. అంతర్జాతీయంగా ఈ ఘటన మీద అధ్యయనం జరిగితే దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని వాపోయారని గుర్తు చేశారు.
అన్నమయ్య డ్యామ్‌ని తిరిగి పూర్తిస్థాయిలో పునర్నిర్మానం చేసి ఒక ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని ఘనంగా ప్రకటించారని అన్నారు. దుర్ఘటన జరిగి 18 నెలలు గడుస్తున్నా ప్రాజెక్టు పూర్తి దేవుడికి ఎరుక అన్నారు. కనీసం ఈ రోజుకి కూడా వీసమెత్తు పనులు చేయలేదని విమర్శించారు. ఈ 18 నెలలలో సాధించింది ఏమిటయ్యా అంటే అస్మదీయుడు పొంగులేటికి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని 660 కోట్లకు అప్పచెప్పారని సెటైర్లు వేశారు.
Also Read: గుడివాడ బస్టాండ్ దగ్గరే తేల్చుకుందాం - కొడాలి నానికి విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ ! అసలేం జరిగిందంటే ?
Also Read: ఓ వైపు లోకేష్ - మరో వైపు చంద్రబాబు ! ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశమే హైలెట్ అవుతోందా ?