ఏపీలో ఓట్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుకు పోటీగా వైఎస్ఆర్ సీపీ నేతలు కూడా సీఈసీని కలిశారు. చంద్రబాబు హాయాంలోనే నకిలీ ఓటర్లను చేర్చారని వాటిని తొలగించామని వారు చెప్పారు. ప్రస్తుతం ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని అన్నారు. అవన్నీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే చేర్చారని వైసీపీ నేతలు ఆరోపించారు. భేటీ అనంతరం ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. 


2019లో ఎన్నికలకు ముందు 3 కోట్ల 97 లక్షల మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. ఇప్పుడు కూడా ఓ లక్ష ఎక్కువ ఉన్నారని విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు హాయాంలో నకిలీ ఓట్లు చేర్చారని, తాము ఆ పని చేయలేదని ఈసీకి వివరించినట్లుగా విజయసాయి అన్నారు. ఆయన హాయాంలో ఓట్లను ఎలా మార్చారో మొత్తం వివరాలను ఈసీకి వివరించినట్లుగా చెప్పారు. ఆధార్‌కు ఓటర్ కార్డును లింక్ చేశారనేదే చంద్రబాబు బాధ అని అన్నారు. అలా చేస్తే వ్యక్తి చనిపోయిన వెంటనే ఆధార్ పని చేయదు కాబట్టి, ఓటర్ ఐడీ కార్డు కూడా పని చేయదని అన్నారు. ఒలింపిక్స్‌లో దొంగ ఓట్ల పోటీలు ఉంటే చంద్రబాబే నెంబర్ వన్ విజేతగా ఉంటారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.


గతంలో తాను ఎన్‌రోల్ చేయించిన బోగస్ ఓట్లు అన్నింటిని తాము ఎక్కడ తొలగిస్తామో అన్న భయంతో ఇప్పుడు చంద్రబాబు సీఈసీని కలిసి తమపై ఫిర్యాదు చేస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. పారదర్శకంగా ఓట్లు ఉండాలన్నదే వైసీపీ విధానం అని అన్నారు. 2015 నుంచి చేరిన దొంగ ఓట్ల జాబితాను సీఈసీకి ఇచ్చామని అన్నారు.