Sajjala Attended Police Investigation In Mangalagiri: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) గురువారం మంగళగిరి (Mangalagiri) పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని.. ఆయనకు మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేయడంతో పీఎస్‌కు వచ్చారు. సజ్జల వెంట న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఇతర నేతలు ఉన్నారు. అయితే, సజ్జల ఒక్కరినే విచారణకు పోలీసులు అనుమతించారు. సజ్జలతో పాటు విచారణాధికారి వద్దకు తనను కూడా అనుమతించాలని పొన్నవోలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే, దీనికి కోర్టు అనుమతి తప్పనిసరి అని.. సజ్జలతో పాటు విచారణకు అనుమతించలేమని స్పష్టం చేశారు. మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, గ్రామీణ సీఐ శ్రీనివాసరావు ఆయన్ను విచారించారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ కేసుకు సంబంధించి 120వ నిందితుడిగా సజ్జల పేరును చేర్చారు. దీనిపై విచారణకు హాజరు కావాలని సజ్జలకు బుధవారం నోటీసులు ఇచ్చిన పోలీసులు.. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లోపు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. దీంతో సజ్జల విచారణకు హాజరయ్యారు.


'అక్రమ కేసులతో వేధిస్తున్నారు'


ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని సజ్జల మండిపడ్డారు. విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 'ప్రజాసమస్యలను టీడీపీ గాలికి వదిలేసింది. కేవలం వైసీపీ నాయకులను మాత్రమే టార్గెట్ చేశారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ భయపెట్టాలని చూస్తున్నారు. విచారణ పేరుతో అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతున్నారు. ప్రజల దృష్టి మరల్చాలని చూస్తున్నారు. దాడి జరిగిన రోజు నేను మంగళగిరిలోనే లేను. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ కక్షసాధింపులు మానుకోవాలి. కేసును పొడిగించాలనే సీఐడీకి అప్పగించారు. ఎల్‌వోసీ ఇవ్వడంపై కోర్టుకు వెళ్తాం.' అని సజ్జల పేర్కొన్నారు.


'న్యాయపోరాటం చేస్తాం'


సజ్జల రామకృష్ణారెడ్డికి న్యాయస్థానం ఈ నెల 24 వరకూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే ఈ నెల 10వ తేదీనే లుక్ అవుట్ నోటీసులు ఎలా ఇస్తారని లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. దాడి జరిగిన రోజు మంగళగిరికి సజ్జల 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు కోర్టుకు ఆధారాలు కూడా సమర్పించామని.. పోలీసులకు విచారించే అధికారం ఉన్నట్లు నిందితులకూ హక్కులు ఉన్నాయన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసును రకరకాలుగా తిప్పుతున్నారని.. దీనిపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. 


ఇదీ జరిగింది


వైసీపీ హయాంలో 2021 అక్టోబర్ 19న ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. వైసీపీ నేతలు దేవినేని అవినాష్,లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు దాడి చేశారని అభియోగాలు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో సజ్జల ప్రమేయం ఉందని గుర్తించడంతో పోలీసులు ఆయన విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అటు, ఈ కేసు విచారణను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సీఐడీకి దర్యాప్తు బాధ్యతను అప్పగించింది. ఇప్పటివరకూ ఈ కేసును మంగళగిరి, తాడేపల్లి పోలీసులు దర్యాప్తు చేశారు. 


మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పానుగంటి చైతన్యం సోమవారం కోర్టులో లొంగిపోయారు. వైసీపీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన గతంలో టీడీపీ కార్యాలయంపై దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడనే ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. చైతన్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.  ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు వైసీపీ నేతలను విచారిస్తున్నారు.


Also Read: AP IAS : ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్‌లు - త్వరలో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం