సీపీఎస్ పెన్షన్ స్కీం రద్దు అనేది దశాబ్ద కాలంగా ప్రభుత్వ ఉద్యోగుల కల. అయితే ఇక సాధ్యపడదు అని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. రిటరైన తర్వాత జీవితాంతం ఇచ్చే పెన్షన్ స్కీం ని తిరిగి పొందొచ్చు అని ఆశపడిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఎదురు దెబ్బె తగిలింది అని చెప్పాలి. 2019 ఎన్నికల సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రధాన హామీల్లో ఈ సీపీయస్ స్కీం రద్దు ఒకటి. కానీ అవగాహన లేకనే అప్పట్లో ఈ హామీ ఇచ్చామంటూ ప్రభుత్వ సలహాదారు హోదాలో సజ్జల రామకృష్ణా రెడ్డి కుండ బద్ధలు కొట్టేశారు. దానితో అవాక్కవ్వడం ఉద్యోగుల పని అయింది.


అసలు ఈ సీపీఎస్ స్కీం అంటే ఏంటి?
సీపీఎస్ పెన్షన్ స్కీమ్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) కు 2003 చివర్లో అప్పటి వాజ్‌పేయ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ స్కీమ్ ను 2004లో అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం అమలు చేసింది. ఈ సీపీఎస్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి రాకముందు ఉద్యోగుల జీతాల నుండి పెన్షన్ కోసం పైసా కూడ కట్ చేసేవారు కాదు. కానీ.. కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతీ ఉద్యోగి జీతం నుండి కనీసం 10 శాతాన్ని పెన్షన్ స్కీమ్ కోసం కట్  చేస్తున్నారు. ఉద్యోగుల వేతనాల నుండి కట్ చేసిన నిధులను పెట్టుబడులు గా ప్రభుత్వం మారుస్తోంది. ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఆ కట్ చేసిన మొత్తాన్ని వడ్డీ/లాభం ను బట్టి నెల నెలా పెన్షన్ కింద అందిస్తారు . అయితే ఈ పెట్టుబడులన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతిల్లోకి వెళ్తాయని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయంతో ఉన్నారు. పాత పెన్షన్ స్కీమ్ లో అయితే పెన్షన్ కోసం ఒక్క పైసా కూడా ఉద్యోగి వేతనం కూడా కట్ చేసేవారు కాదు. కాబట్టి పాత పెన్షన్ స్కీమ్ పద్ధతిలోనే ఉద్యోగులు ప్రయోజనం పొందేవారని ఉద్యోగ సంఘాలు అభిప్రాయంతో ఉన్నాయి. ఉద్యోగి బేసిక్ వేతనంలో  7 ఏళ్ళ పాటు సగం జీతాన్ని పెన్షన్ రూపంలో చెల్లించేవారు. ఆ తర్వాత 30 శాతం పెన్షన్ గా చెల్లించేవారు. అది ఇప్పుడు లేదు.


సీపీఎస్ పెన్షన్ స్కీమ్ కోసం 2013 వరకు చట్టం కాలేదు. 2004లో యూపీఏ తొలిసారిగా అధికారంలో ఉన్న కాలంలో వామపక్షాలకు పార్లమెంట్ లో ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు. 2009 ఎన్నికల్లో ఆ పార్టీలకు ఎంపీల సంఖ్య తగ్గింది. వామపక్షాలు సంఖ్య తగ్గడంతో 2013 అక్టోబర్ మాసంలో ఈ స్కీమ్ చట్టంగా మారింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ యాక్ట్ కు 2013 ఆగష్టులో చట్టం అయింది.  అయితే ఈ చట్టంలో చేరడానికి ఆసక్తి ఉన్న రాష్ట్రాలు చేరవచ్చని కేంద్రం ఆయా రాష్ట్రాలను కోరింది. కానీ ఒక్కసారి ఈ స్కీమ్ కు ఒప్పుకుంటే తిరిగి బయటకు రావడం ఉండదని అప్పట్లో కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోలేదు. అయినా చివరకు వారిని కూడా ఒప్పించి ఈ పథకాన్ని అమలు పరిచారు.
సీపీఎస్ విధానం ద్వారా ఉద్యోగులకు పెన్షన్ అతి తక్కువగా పొందే అవకాశం ఉంది.  అతి తక్కువ మొత్తాన్ని ఈ స్కీమ్ ద్వారా పెన్షన్ గా పొందనున్నారని ఉద్యోగ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.


ఒక్కసారి సీపీఎస్ కు ఒప్పుకున్నాక తిరిగి వెనక్కు రావడం జరుగుతుందా?
 సీపీఎస్ స్కీమ్ లో చేరడమే కానీ బయటకు వచ్చే అవకాశం కూడా  రాష్ట్రాలకు లేదనే అభిప్రాయాలను కూడా వ్యక్తం చేసే వారు ఉన్నారు. అయితే ఉద్యోగుల పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వ్యవహారమని ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ చెప్పినట్టుగా కొన్ని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈ స్కీమ్ నుండి వైదొలిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంటే కేంద్రానికి లేఖ రాస్తే ఆ దిశగా చర్యలు తీసుకొనే అవకాశాలు లేకపోలేదని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక సీపీఎస్ ను రద్దు చేస్తామని చెబుతూ పబ్బం గడుపుతున్నాయి. 


అవగాహన లేకనే సీపీఎస్ రద్దు పై హామీ ఇచ్చాం: వైసీపీ
అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత సీపీఎస్ రద్దు మా వల్ల కాదంటూ జగన్ సర్కార్ చేతులెత్తేసింది. సాంకేతిక అంశాలు తెలియకుండా హామీ ఇచ్చామని, సీపీఎస్ రద్దు అసాధ్యమని ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పేయడంతో ఇక ఆ అంశానికి తెరపడినట్లయింది. అధికారంలోకి వచ్చిన వారం లోపు సీపీఎస్ పథకాన్ని రద్దు చేస్తామన్న వైసీపీ ఇలా యూ-టర్న్ తీసుకోవడం తో ఉద్యోగ సంఘాలు షాక్ తిన్నాయి.


సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి: నారా లోకేష్ 
ఈ వ్యవహారం పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. నాడు ఉద్యోగుల ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చారు జగన్. నేడు మాట మార్చుడు, మడమ తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు.. అన విమర్శించారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్న మాటకి రెండున్నరేళ్ళు అయినా దిక్కు లేదు.. పైగా జగన్ కు అవగాహన లేకే సీపీఎస్ రద్దు చేస్తామనే హామీ ఇచ్చారంటూ స్వయంగా సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడం ఉద్యోగులని దారుణంగా మోసగించడమే అని లోకేశ్ వ్యాఖ్యానించారు.


ఇక సీపీఎస్ రద్దు ముగిసిన అధ్యాయమే:
సీపీఎస్ రద్దు అంశంలో అనేక సాంకేతిక సమస్య లు ఉన్నాయంటోంది వైసీపీ. ఉద్యోగుల కు మాత్రం నష్టం కలగనివ్వమని చెబుతుంది. కానీ దశాబ్ద కాలంగా ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ అయిన ఈ సీపీఎస్ రద్దు మాత్రం ఇక తీరని కలే అని తాజా పరిణామాలు చెబుతున్నాయి.


Also Read: Jagan Governer : మరికొన్నాళ్లు విశ్రాంతి తీసుకోండి.. ఏపీ గవర్నర్‌కు ముఖ్యమంత్రి సూచన !


Also Read: Srikalahasti College : దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని ఒకే ఒక్క ఇంజినీరింగ్‌ కాలేజీ మూసివేత.. రోడ్డున పడ్డ ఉద్యోగులు !


Also Read: Corona Update: ఏపీలో కొత్తగా 163 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ముగ్గురు మృతి