శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీకాళహస్తీశ్వర ఇంజనీరింగ్ , డిప్లమా కాలేజ్ ను మూసివేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. కళాశాలలో ఉద్యోగ సిబ్బందిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో కాలేజీ సిబ్బంది దిగ్బ్రాతికి గురయ్యారు. శ్రీకాళహస్తీశ్వర ఇంజనీరింగ్ కళాశాలకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ఉంది. అయితే ఇటీవలి కాలంలో ఆ కాలేజీ నిర్వహణ లోపం కారణంగా వెనుకబడిపోయింది.
Also Read : అమరావతి రైతుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. తిరుపతిలో 17న బహిరంగ సభ
నవంబర్ 25వ తేదీన దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కాలేజీ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించారు. కాలేజీని శాశ్వతంగా మూసేయాలని నిర్ణయించారు. అప్పటికే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. స్కిట్ కాలేజ్ లో ఉన్న విద్యార్థులను ఇప్పటికే ఇతర కళాశాలకు పంపివేశారు. కళాశాలలో విద్యార్థులు ఎవరూ లేని కారణంగా కళాశాల మూసి వేస్తున్నామని కారణం చెప్పారు. సిబ్బంది ఇక అవసరం లేదు కాబట్టి సిబ్బందిని తొలగించాలని తీర్మానం చేసి,ఆ మేరకు చర్యలు చేపట్టారు.స్కిట్ కళాశాల ఉద్యోగ సిబ్బందికి ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
డిసెంబర్ ఒకటో తేదీన ఉత్తర్వులు జారీ చేశారు . కానీ ఇంత కాలం రహస్యంగా ఉంచారు. 14వ తేదీన ఉద్యోగులకు ఇచ్చారు. ఒక్కసారిగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు అందజేయడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకైక ఇంజనీరింగ్ కళాశాల స్కిట్ ఒక్కటే. అందుకే ఏదో విధంగా కళాశాలను కాపాడుతారు అన్న ఆశలపై నీళ్లు చల్లుతూ నవంబర్ 25వ తేదీన దేవాదాయశాఖ మూసివేతకు నిర్ణయించింది. కళాశాల మూసి వేస్తున్న విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు.
Also Read : దేవుడున్నాడు ! టిక్కెట్ల వివాదంపై జగన్ ఊతపదంతోనే కౌంటర్ ఇచ్చిన బాలకృష్ణ !
స్కిట్ ఉద్యోగ సిబ్బంది కొందరు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లుగా ఉత్తర్వులను తీసుకోగా.. మరికొందరు నిరాకరించారు. ఒక్కసారిగా ఉద్యోగాల నుంచి తీసేస్తే తాము తమ బిడ్డలు ఎలా జీవించాలని.. నిర్వహణ లోపాల మూలంగా స్కిట్ ను మూతేస్తున్నారని తాము ఎందుకు బలి కావాలని వారు ప్రశ్నిస్తున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి జోక్యం చేసుకుని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. అలా చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యం అంటూ స్కిట్ ఉద్యోగ సిబ్బంది కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి