YSRCP News: వైఎస్ఆర్ సీపీ నుంచి రాజ్యసభకు పంపే అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి మళ్లీ అవకాశం దక్కనుంది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య, సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావుకు కూడా వైఎస్ఆర్ సీపీ నుంచి రాజ్యసభకు ఛాన్స్ ఇవ్వనుందని సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్న సంగతి తెలిసిందే. రాజ్యసభ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభుల పదవీకాలం జూన్ 21తో ముగుస్తుంది. దాంతో ఈ నాలుగు సీట్లకు జూన్ లో ఎన్నిక జరగనుంది. ఇటీవలే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. దీంతో అభ్యర్థులు ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలాల ప్రకారం మొత్తం నాలుగు రాజ్యసభ సీట్లు అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకోనుంది.
ప్రస్తుతం వైసీపీకి పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయి రెడ్డి కొనసాగుతున్నారు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఈయనకు మరోసారి అవకాశం దక్కనుండగా.. ఒక సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డికి కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని జగన్ ఇవ్వనున్నారని పార్టీలో వినిపిస్తోంది.
Also Read: Cabs Bundh: అలర్ట్! ఈ నెల 19న క్యాబ్స్ బంద్, ఆటోలు కూడా - పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు
క్రిష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతుండగా, ఆయన ఏకంగా మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ కర్నూలు పర్యటన ఉన్న నేపథ్యంలో అది ముగిసే వరకూ వేచి ఉంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈయన టీడీపీ తరపున ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేకుండా, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు.
రాజ్యసభ ఎన్నికల కోసం మే 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మే 31గా ఈసీ నిర్ణయించింది. జూన్ 1వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3 వరకు గడువు ఉంటుంది. జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు చెప్తారు.
Also Read: AP PCC New Chief Kiran : వైఎస్ఆర్‌సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?