బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగి ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఈవీఎంలలో 89, 660 ఓట్ల మెజార్టీ సాధించారు. పోస్టల్ ఓట్లతో కలుపుకుని 90,089 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం పన్నెండు రౌండ్ల కౌంటింగ్‌లో ఆమెకు 1, 11, 227 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి పనతల సురేష్‌కు 21567 ఓట్లు పోలయ్యాయి. దీంతో 89, 660 ఓట్ల తేడాతో డాక్టర్ సుధ విజయం సాధించినట్లయింది. పోస్టల్ ఓట్ల ఆధిక్యం కలుపుకుంటే మెజార్టీ కాస్త పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మకు 6191 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 3616 ఓట్లు వచ్చాయి. ఇది గత ఎన్నికల్లో కంటే ఎక్కువ. పోస్టర్ ఓట్లలో 362 వైఎస్ఆర్‌సీపీకి దక్కగా బీజేపీకి 40 ఓట్లు మాత్రమే వచ్చాయి.
Also Read : "సమైక్య రాష్ట్రంగా మళ్లీ ఏపీ" ! సాధ్యమా ? రాజకీయమా?
బద్వేలు నియోజకవర్గంలో మొత్తం 2,15,240 ఓట్లు ఉండగా, 1,47,213 ఓట్లు పోలయ్యాయి. పోలయిన ఓట్లలో 76.23 శాతం వైసీపీ అభ్యర్థికే పోలయ్యాయి. బద్వేలులో వైసీపీ విజయంపై ఎవరికీ అనుమానాల్లేవు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా బరిలో నిలబడలేదు. లక్ష ఓట్ల మెజార్టీని లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసి పంపించారు. దానికి తగ్గట్లుగానే ఎన్నికల బాధ్యతలు తీసుకున్న పెద్దిరెడ్డి శ్రమించారు.
తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బద్వేలు బాధ్యతల్ని కూడా నిర్వర్తించారు. ఆయన ఎన్నిక గురించి ప్రతి విషయాన్ని పక్కాగా పరిశీలించి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ప్రచారంలో ఎక్కడా తగ్గలేదు. సీరియస్‌గా ప్రచారం చేశారు. ఎలక్షనీరింగ్ కూడా లోపాలు లేకుండా చేసుకున్నారు. ఓటర్లందర్నీ బూత్‌ల వద్దకు తరలించుకోగలిగారు. ఆ ఫలితం కౌంటింగ్‌లో కనిపించింది. అయితే ఓటింగ్ శాతం గత ఎన్నికల కంటే ఎనిమిది శాతం వరకూ తగ్గడంతో లక్ష మెజార్టీని అందుకోలేకపోయారు.
బద్వేలులో గత ఎన్నికల్లో బీజేపీ నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ సారి దాదాపుగా 21వేలకుపైగా ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నలభై వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ సారి అది రెండింతలు అయింది. ఇది తమ ప్రభుత్వ పాలనకు ప్రజామోదానికి సాక్ష్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.