జూలై 7, 8న వైఎస్సార్ కడప జిల్లాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్  
రేపు పులివెందుల, వేంపల్లెలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్న సీఎం
జూన్ 8న ఉదయం వైఎస్సార్‌కు నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి,
అనంతరం విజయవాడ చేరుకుని పార్టీ ప్లీనరీలో పాల్గొననున్న సీఎం


ఏపీ  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 7,8 తేదీలలో ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం అందుకు ఏర్పాట్లు చేసింది.


జూలై 7న సీఎం జగన్ షెడ్యూల్‌
ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.50 గంటలకు పులివెందుల చేరుకుంటారు. అక్కడి ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ప్రజలు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి వారి వినతులు స్వీకరిస్తారు. ఆ తర్వాత 1.30 గంటలకు పులివెందులలోని ఏపీ కార్ల్‌ చేరుకుంటారు, అక్కడ న్యూటెక్‌ బయోసైన్సెస్‌కు శంకుస్ధాపన చేస్తారు. అనంతరం ప్రధాన భవనంలో ఐజీ కార్ల్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి 3.05 గంటలకు వేంపల్లి చేరుకుంటారు. 3.30 గంటలకు డాక్టర్‌ వైఎస్సార్‌ స్మారక పార్క్‌కు చేరుకుని పార్క్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు వేంపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు చేరుకుని భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడ విద్యార్ధిని, విద్యార్ధులతో ముచ్చటించిన అనంతరం సాయంత్రం 5.25 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు. 


జూలై 8న షెడ్యూల్‌
ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 8.05 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు. అక్కడ తన తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి నివాళులర్పించి ప్రార్ధనల్లో పాల్గొంటారు. అనంతరం 8.55 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా జరిగే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో సీఎం జగన్ పాల్గొననున్నారు.

భద్రత కట్టుదిట్టం..
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కడప కలెక్టర్‌ వి.విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు పేర్కొన్నారు. కడప – పులివెందుల బైపాస్‌ రోడ్డులో సీఎం ల్యాండ్ కానున్న హెలీప్యాడ్‌ స్థలాన్ని ఉన్నతాధికారులు మంగళవారం సందర్శించారు. సీఎం జగన్ కార్యక్రమంలో జేసీ సాయికాంత్‌వర్మ, అడిషనల్‌ ఎస్పీ మహేష్‌కుమార్, ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీఓ, డీఎస్పీ, ఎంపీపీ, మండల ఉపాధ్యక్షుడు బాబా షరీఫ్, విద్యుత్‌ శాఖ డీఈ శ్రీకాంత్, ఎమ్మార్వో పలు శాఖల అధికారులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. 


Also Read: Vijayawada: బార్లు, వైన్ షాపుల్లో అవి త‌ప్ప‌కుండా పెట్టాల్సిందే! ఓనర్లకి బెజ‌వాడ పోలీసుల వార్నింగ్