విజయవాడలో జరిగే ప‌ది నేరాల్లో ఆరు మ‌ద్యం కార‌ణంగానే జ‌రుగుతున్నాయ‌ని డీసీపీ విశాల్ గున్నీ వ్యాఖ్యానించారు. జ‌నావాసాల మ‌ధ్య ఉన్న బార్ షాప్ లపై ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆయ‌న యాజ‌మాన్యాల‌కు సూచించారు. రాత్రి 11 గంట‌ల‌కు బార్ ల‌ను ఖ‌చ్చితంగా మూసివేయాల‌ని ఆదేశించారు. బార్ ప్రాంగ‌ణంలో జ‌రిగే నేరాల స‌మాచారాన్ని వెంట‌నే సంబంధిత పోలీస్ స్టేష‌న్ల‌కు అందించాల‌ని ఆయ‌న సూచించారు.బార్ ప‌రిస‌ర ప్రాంతాలు క‌నిపించే విధంగా సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేయాల‌న్నారు. విజ‌య‌వాడ  క‌మాండ్ కంట్రోల్ రూంలో ఆయన న‌గ‌ర ప‌రిధిలోని బార్ య‌జ‌మానుల‌తో బుధవారం స‌మావేశం అయ్యారు.


అనంత‌రం డీసీపీ మాట్లాడుతూ నేరాల నియంత్ర‌ణ‌లో బార్ షాపుల య‌జ‌మానుల పాత్ర కీల‌కం అన్నారు. న‌గ‌రంలో జ‌రిగే నేరాల్లో 60 శాతం వ‌ర‌కు మ‌ద్యం వ‌ల‌నే జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన్నారు. ఆధునిక ప‌రిజ్ఞానంతో కూడిన‌ సీసీటీవీ కెమేరాలను బార్ ప‌రిస‌ర ప్రాంగ‌ణాల్లో ఏర్పాటు చేయ‌టం త‌ప్ప‌నిస‌రని అన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్క‌ర్ అమ్మితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. బార్ ల వ‌ల‌న ఏర్ప‌డే ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌కు యాజ‌మానులే బాధ్యత వ‌హించాల‌ని సూచించారు. పోలీసుల నుండి స‌హ‌కారం అందుతుంద‌ని, అదే స‌మ‌యంలో యాజ‌మాన్యాల నుండి కూడా త‌మ‌కు మ‌ద్ద‌తు ఉండాల‌ని కోరారు.


బార్ పైనే పోలీసుల గురి 
బెజ‌వాడ‌ల లో బార్ ల పైనే పోలీసులు ఎక్కువ‌గా గురి పెట్టారు. ఇందుకు కార‌ణం కూడ ఉంది. విజ‌య‌వాడ వంటి న‌గ‌రంలో జ‌రుగుతున్న నేరాల‌కు మ‌ద్యం లింక్ అయ్యి ఉంటుంది. నేరం జ‌రిగిన త‌రువాత నేర‌స్తుడు లేక నేరానికి సంబందించిన వ్య‌క్తులు మ‌ద్యం తాగేందుకు బార్ కు రావ‌టం, లేదా మ‌ద్యం తాగిన త‌రువాత నేరాల‌కు పాల్ప‌డ‌టం లాంటి సంఘ‌ట‌న‌లు పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డ‌వుతున్నాయి. ప్ర‌తి ప‌ది నేరాల్లో 6కు పైగా నేరాలు మ‌ద్యానికి లింక్ అయ్యి ఉంటున్నాయని స్వ‌యంగా డీసీపీ విశాల్ గున్ని వ్యాఖ్యానించారంటే, మ‌ద్యం ప్ర‌భావం ఎంత‌గా ఉంద‌నేది స్ప‌ష్టం అవుంది.


దీంతో ఇప్పుడు పోలీసులు మ‌ద్యం దుకాణాలపైనే ఎక్కువ‌గా క‌న్నేశారు. దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డిన వారు కూడా బార్ ల‌కు వ‌చ్చి మ‌ద్యం తాగి, ఆ మ‌త్తులో వాస్త‌వాలు మాట్లాడుకుంటారు. అలాంటి స‌మాచారం కూడ పోలీసుల‌కు చాలా కీల‌కం. ఇటీవ‌ల జ‌రిగిన చెయిన్ స్నాచింగ్ కేసుల్లో కూడ ఇలాంటి ఆధారాలే పోలీసుల‌కు ల‌భించాయి. దొంగ బంగారం కొనుగోలు చేయ‌టంతో పాటుగా గుట్కా, గంజాయి, వంటి మ‌త్తు ప‌దార్థాల ర‌వాణాకు కూడా బార్ లు ఇంట‌ర్ లింక్ అయ్యి ఉంటున్నాయి. ఇలాంటి అనుభ‌వాల‌ను పూర్తిగా అవ‌గాహ‌న క‌ల్పించుకున్న పోలీసులు బార్ లకు వ‌చ్చిపోయే వారి వివ‌రాల‌తో కూడిన సీసీటీవీ కెమెరాల నిఘా పైనే దృష్టి సారించారు.


ఫుల్ హెచ్‌డీతో సీసీటీవీ కెమేరాలు
పోలీసులు చెప్పినప్పుడ‌ల్లా బార్ య‌జ‌మానులు నామ్ కే వాస్తేగా సీసీటీవీ కెమేరాల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఆ త‌రువాత వాటి నిర్వాహ‌ణ ప‌ట్టించుకోవ‌టం లేదు. మరి కొంద‌రు అయితే నాణ్య‌త‌లేని కెమేరాల‌ను ఏర్పాటు చేయ‌టం వ‌ల‌న పిక్చ‌ర్ క్వాలిటి స‌రిగా లేక డిజిటల్ ఎవిడెన్స్ కు ఉప‌యోగం లేకుండాపోతుంది. దీంతో పోలీసుల చేతిలో నిందితుడు ఉన్నా, అత‌నిపై నేరం రుజువు చేయ‌లేని నిస్స‌హాయ స్దితిలో పోలీసులు కోర్టులో ఫెయిల్ అవ్వాల్సి వ‌స్తుంది. ఇలాంటి ప‌రిస్థితుల‌పై అధ్యయ‌నం చేసిన పోలీసులు ప్ర‌త్యేకంగా బార్ యాజ‌మాన్యాల‌తో మాట్లాడి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.