తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రెండు వ్యవస్థలను రద్దు చేస్తారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నడుస్తోంది. సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామంటూ ఆ పార్టీ ప్రధానకార్యదర్శి నారా లోకేష్, ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి పేరుతో ఉన్న ట్వీట్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీకి వ్యతిరేకంగా పని చేస్తున్న వారంతా దీన్ని సర్క్యులేట్ చేస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామంటూ చేస్తున్న ప్రచారంపై టీడీపీ మండిపడుతోంది. ఇలాంటి ఫేక్ ప్రచారంతో ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి అధికారి పార్టీ బరితెగించిందని విమర్శిస్తున్నారు. దీనికి కౌంటర్ ప్రచారాన్ని ప్రారంభించింది టీడీపీ. తాము అధికారికంగా ప్రధాన మీడియాకు ఇచ్చిన ప్రకటనలనే పరిగణలోకి తీసుకోవాలని మిగతా దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెబుతోంది టీడీపీ.
మొన్నటికి మొన్న టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న పేరుతో ఈ ఫేక్ ప్రచారం నడిచింది. దాన్ని ఆయన ఖండిస్తూ ప్రెస్‌మీట్ పెట్టారు. ఇప్పుడు లోకేష్ పేరుతో పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీన్ని కూడా టీడీపీ తీవ్రంగా తప్పుపడుతోంది. ఐ ప్యాక్ ఆధ్వర్యంలో ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ ఇలాంటి ఫేక్ ప్రచారాన్నే నమ్ముకుందని టీడీపీ లీడర్లు చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా దాన్నే నమ్ముకొని మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారంటున్నారు. కనీసం సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కూడా ఓట్లు వేయరని తెలిసే ఇలాంటి ఫేక్ ప్రచారంతో వాళ్లనైనా ఓట్లు వేసేలా ప్రజలతో వేయించేలా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
గతంలో ఏకంగా చంద్రబాబు పేరుతో ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. తన కుమారుడు పాదయాత్ర చేయలేడని... చేతకాని వాడంటూ చంద్రబాబు చెప్పినట్టు ఓ పోస్ట్ సోషల్ మిడియాలో తిరిగింది. అప్పుడు కూడా దాన్ని టీడీపీ ఖండించి.. వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 2024 ఎన్నికల కోసం టీడీపీ తన తొలి అభ్యర్థిని ప్రకటించేసిందన్న ప్రచారం కూడా సాగించారు నెటిజన్లు.