YSRCP Ballineni Issue : వైఎస్ఆర్‌సీపీలో ప్రకాశం జిల్లా పంచాయతీ తేలడం లేదు. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్లను హైకమాండ్ పట్టించుకోవడం లేదు. ఐదో జాబితా ముందు ఈ అంశంపై ఓ స్పష్టత ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. ఒంగోలు లోక్ సభ టిక్కెట్ ను.. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికే కేటాయించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం మాగుంట విషయంలో ఏ మాత్రం ఆసక్తికరంగా లేరు. ఆయనకు కానీ ఆయన కుమారుడికి కానీ టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. అలా కాకపోతే తన కుమారుడు ప్రణీత్ రెడ్డికి అయినా చాన్సివ్వాలని కోరుతున్నారు. దానికి కూడా సీఎం జగన్ అంగీకరించలేదు.
మాగుంటకు టిక్కెట్ ఇవ్వాలని బాలినేని పట్టు
తిరుపతికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీ సీటు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే చెవిరెడ్డికి సపోర్ట్ చేసేందుకు బాలినేని సిద్ధంగా లేరు. ఈ అంశంపై మాట్లాడేందుకు సోమవారం బాలినేని సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వచ్చారు. కానీ కారు దిగకుండానే వెనక్కి వెళ్లిపోయారు. చెవిరెడ్డికే ఎంపీ టిక్కెట్ ఖరారు చేసినట్లగా తెలియడంతో.. మాగుంటకు సీటు లేకపోతే తనకు ఫోన్ చేయవద్దని వైసీపీ పెద్దలకు బాలినేని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. సీఎం పిలిచినా రాను అని ఖరాఖండిగా చెప్పారని అంటున్నారు. నెల్లూరు, ఒంగోలు కొత్త ఇన్‌ఛార్జ్ గా చెవిరెడ్డిని నియమిస్తున్నామని బాలినేనికి సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు. దీంతో ఆయన మరోసారి హైదరాబాద్ వెళ్లిపోయారు.
క్రమంగా జగన్ కు దూరమవుతున్న బాలినేని
రెండో దఫా మంత్రివర్గ విస్తరణ లో పదవిని కోల్పోయిన బాలినేని అప్పట్నుంచి వైసీపీ అధినేత అభిమానాన్ని కోల్పోయారు. బాలినేనికి ఒంగోలు అసెంబ్లీ టికెట్ వస్తుందో రాదో కూడా సరిగ్గా క్లారిటీ లేని పరిస్థితి. అయితే ఇటీవల ఆయనకు టికెట్ విషయం అయితే క్లారిటీ వచ్చింది కానీ.. జిల్లాలో వైసీపీ కీలక నేతగా ఉన్నప్పటికీ నియోజకవర్గాల ఇంచార్జులను నియమించే సమయంలో కనీసం సంప్రదించనే లేదు. ఇప్పుడు కూడా ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో జగన్ వర్సెస్ బాలినేనిగా పరిస్థితులున్నట్లుగా తెలుస్తోంది.
పార్టీ మారే అవకాశాల్లేవంటున్న వైసీపీ నేతలు
బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం జగన్ కు దగ్గర బంధువు. గతంలో ఆయన జనసేన పార్టీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. తర్వాత పలు సందర్భాల్లో వైసీపీ అధినేతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆయన పార్టీ మారే అవకాశం ఉండడని.. వైసీపీ తరపునే పోటీ చేస్తారని అంటున్నారు. మరో వైపు మాగుంట శ్రీనివాసులరెడ్డి .. తన కుమారుడితో కలిసి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.