Financial Crisis In AP: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడ్డగోలు చర్యలతో ఏపీలో ఆర్థిక సంక్షోభం ఏర్పాడే ప్ర‌మాదం ఉంద‌ని శాస‌న మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేత య‌న‌మ‌ల రామకృష్ణుడు ఆరోపించారు. కేంద్రంతో ఏపీ స‌ర్కారు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను వెంట‌నే బహిర్గతం చేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ఏపీలో వాస్తవ ఆర్థిక పరిస్థితిని మరుగునపెట్టి తప్పుడు లెక్కలతో అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రజలను సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని య‌న‌మ‌ల ఫైర్ అయ్యారు. అత్మ‌కూరులోని పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి య‌న‌మ‌ల ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 


అధిక వడ్డీలకు రుణాలు.. 
రాష్ట్ర రెవెన్యూ ఆదాయాలతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా అధిక వడ్డీలకు అప్పులు తెస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం పాల్పడుతోందని, ఒక తప్పును సరిద్దిడానికి తప్పుమీద తప్పు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశార‌ని ఆరోపించారు. రాష్ట్రంలోని పరిస్థితి చూసి పెట్టుబడులు పెట్టడానికి, అప్పులివ్వడానికిగానూ ఏ సంస్థలు ముందుకు రావడం లేదని వ్యాఖ్యానించారు. అర్హతకు మించి రుణాలు తీసుకోవడం, కేంద్రం ఇచ్చిన నిధులను ఇష్టానుసారంగా బదిలీ చేసి ప్రజా ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించారు. 


జగన్ సర్కార్ వైఫల్యానికి ఇదే నిదర్శనం..
వైసీపీ ప్రభుత్వ పాలనతో రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించడంతో వేజ్ అండ్ మీన్స్‌ అడ్వాన్స్‌ పరిమితుల పై కూడా రిజర్వ్ బ్యాంక్‌ ఆంక్షలు విధించడం జ‌గ‌న్ స‌ర్కార్ వైఫ‌ల్యానికి నిద‌ర్శ‌నం అన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలైన ఉపాధి హామీ, రాష్ట్రీయ ఉచ్చతర్‌ శిక్షా అభియాన్‌ (రూసా), వ్యవసాయ యాంత్రీకరణ సబ్‌మిషన్‌, సుస్థిర వ్యవసాయ కమిషన్‌, ఆయిల్‌ పామ్‌ మిషన్‌, జాతీయ ఆహార భద్రత మిషన్‌, రోజ్‌గార్‌ యోజన, సడక్‌ యోజన, జల్‌జీవన్‌ వంటి పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత వ్యయం చేస్తుంది, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఇచ్చే ప్రత్యేక నిధులను సైతం రాష్ట్ర వాటా జోడించి ఖర్చు చేయడంలో విఫలం కావడంతో ఆ నిధులు సైతం వెనక్కివెళ్లాయని ఆయ‌న మండిప‌డ్డారు. 


నిధులేం చేశారు చెప్పండి.. 
14,15 ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన రూ.6వేల కోట్లు ఏమయ్యాయని జగన్ ప్రభుత్వాన్ని మాజీ ఆర్థిక మంత్రి యనమల ప్ర‌శ్నించారు. జల జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి వచ్చిన రూ.7 వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారని య‌న‌మ‌ల ప్ర‌శ్నించారు. కేంద్రం ఎంత ఇస్తుందో వివరాలు తెలియ చేయాలని డిమాండ్ చేశారు.కేంద్ర పథకాల కింద వచ్చే ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవడం లేదని, వచ్చిన నిధులను దారి మళ్లిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూసా పథకం కింద కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంతో గత ఏడాది నుంచి నిధుల విడుదల కూడా నిలిపివేశారని తెలిపారు. 


రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులు చెల్లించకపోవడంతో రైల్వే పనులు నిలిచిపోయిన విషయం వాస్తవం కాదా అని య‌న‌మ‌ల ప్ర‌శ్నించారు. నడికుడి ‘శ్రీకాళహస్తి, నరసాపురం’ కోటిపల్లి రైల్వే ప్రాజెక్టులు జాప్యం కావడానికి సీఎం జగన్ రాష్ట్ర నిధులు చెల్లించకపోవడం వల్లనే అటకెక్కిన విషయం వాస్తవం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రుణాలు, ఉపయోగిస్తున్న నిధులపై కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్‌, రిజర్వ్ బ్యాంక్‌ (Reserve Bank Of India)తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, అందించిన నివేదికలు, ఆ సంస్థలు ఇచ్చిన ఆదేశాలు, అందులో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినవి, అమలు చేయని వివరాలను బట్టబయలు చేయాలని య‌న‌మ‌ల డిమాండ్ చేశారు. 


Also Read: What is YSRCP Plan : రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ ప్లానేమిటి ? ఓటింగ్ బలంతో రాష్ట్రానికేం సాధించబోతున్నారు ?


Also Read: AP Cabinet Meet : ఈ నెల 22న ఏపీ కేబినెట్ సమావేశం, కీలక అంశాలపై చర్చ