CM Jagan Speech in Satyasai District: చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు గతంలో అనంతపురం జిల్లాలో పర్యటించారని, ఆత్మహత్య చేసుకున్న రైతుకు నష్టపరిహారం అందని వారిని ఒక్కరిని కూడా చూపించలేకపోయారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తాను సవాలు చేసినా వారిద్దరూ స్పందించలేదని చెప్పారు. అంత పారదర్శకంగా తాము రైతుల పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. గతంలో చంద్రబాబు హాయాంలో రైతు బీమా డబ్బులు చాలా మందికి ఇవ్వలేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను పరామర్శించాలన్న ఆలోచన దత్తపుత్రుడికి ఎందుకు రాలేదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పర్యటించారు. 2021 ఖరీఫ్‌ పంటల బీమా పరిహారాన్ని లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్న బహిరంగ సభలో మాట్లాడారు.


‘‘గతంలో చంద్రబాబు ఎన్నికల్లో హామీలిచ్చి రైతులను మోసం చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు. చంద్రబాబుకు ఏం చేస్తే మంచి జరుగుతుందో లెక్కలు వేసుకొని పరిగెత్తే వ్యక్తి దత్తపుత్రుడు. వీరిద్దరూ రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా అని నేను అడుగుతున్నాను. ప్రభుత్వ మంచితనాన్ని పక్కదారి పట్టించేందుకు కొన్ని మీడియా ఛానెళ్లు, పత్రికలు సహా చంద్రబాబు, దత్తపుత్రుడు అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పక్కన పారేసి మోసం చేసే వ్యక్తి చంద్రబాబు.


పదో తరగతి పరీక్షల్లో మన విద్యార్థులకు 67 శాతం ఉత్తీర్ణత వచ్చింది. రెండేళ్ల తర్వాత మూడో ఏడాది పరీక్షలు వచ్చాయి. గుజరాత్ రాష్ట్రంలో 65 శాతమే పది పరీక్షలు పాసయ్యారు. మనకంటే 2 శాతం తక్కువ. ఫెయిలైన విద్యార్థులకు ఆత్మస్థైర్యం పెంచాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం సప్లిమెంటరీ కేటగిరీని తీసేసి, రెగ్యులర్ గానే పరిగణించాలని మనం నిర్ణయించాం. అలాంటిది వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వారు మాట్లాడుతున్నారు.


కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే, దళిత మంత్రి ఇళ్లను కాల్చేశారు. సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్ పేరు పెడితే జీర్ణించుకోలేక హింస చేశారు. ఇలాంటి వారు రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా?’’ అని సీఎం జగన్ ప్రశ్నించారు.


రూ.2,977 కోట్లు విడుదల
రైతుల కోసం ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. 15.61 లక్షల మంది రైతులకు రూ.2,977.92 కోట్లను అందిస్తున్నాం. 2021 ఖరీఫ్‌లో సహజ వైపరీత్యాలు, చీడల వల్ల పంట నష్టపోయిన రైతులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని అందిస్తున్నాం. ఒకప్పుడు అనంతపురం కరువు జిల్లా అని అన్నారు. ఇవాళ దేవుడి దయ వల్ల నీళ్లు కూడా పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి.’’ అని జగన్ అన్నారు. గతంలో రైతులకు ఇస్తామన్న బీమా సొమ్మును చంద్రబాబు ఇవ్వకుండా పోయారని గుర్తు చేశారు. అప్పటికి ఇప్పటికీ మార్పును గమనించాలని కోరారు.


పక్క రాష్ట్రాలకు స్ఫూర్తిగా ఏపీ పథకాలు
‘‘మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను చూసి పక్క రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. కేంద్రం కూడా ఇక్కడి పథకాలను అధ్యయనం చేస్తోంది. ఇప్పటి వరకూ పంట బీమా కింద రూ.6,684 కోట్ల ను రైతులకు అందించాం. టీడీపీ ఐదేళ్లలో బీమా సొమ్ము కింద ఇచ్చింది రూ.3,411 మాత్రమే. 2021 ఖరీఫ్ లో నష్టపోయిన 15 లక్షల మంది రైతులకు రూ.2,977 కోట్ల ను అందించాం. మన పాలనలో రిజర్వాయర్లు, చెరువులు అన్నీ నిండుగా ఉన్నాయి.’’ అని వైఎస్ జగన్ మాట్లాడారు.