Yanam Floods : కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వరదల జలవిలయం సృష్టించింది. వృద్ధ గౌతమి నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో నదీ పరివాహక ప్రాంతమైన యానాం పూర్తిగా జలదిగ్బంధంలోకి చిక్కుకుంది. ఏ వీధిలో చూసినా పీక లోతు వరద నీరు ఏరులై ప్రవహించింది. అర్ధరాత్రి వేళ విరుచుకుపడ్డ జలవిలయంతో ప్రాణాల అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు పలు కాలనీవాసులు. ఇది ముమ్మాటికీ అధికారుల వైఫల్యమైనని ఇక్కడ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.  ముందస్తుగా వరద పరిస్థితిని అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. వరదను ఇసుక బస్తాలతో కట్టడి చేసినట్లయితే ఈ పరిస్థితి తప్పేదని వాపోతున్నారు.



కోనసీమ కన్నీటి గాథలు


కోనసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో వరద ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినా ఇంకా వరద కష్టాలు వెంటాడుతున్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతాలలో ఇంకా ముంపు ముప్పులోనే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తమకు సరైన భోజన సదుపాయాలు, తాగునీరు సక్రమంగా అందడం లేదని పలుచోట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉంటే కరకట్టలు కూడా ఎక్కడపడితే అక్కడ బలహీనపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్షణాన ఏ ఏటిగట్టు కూలిపోతుందో అని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ప్రజాప్రతినిధులు, అధికారులపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏరియల్ వ్యూ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతాలను పరిశీలించారు. శుక్రవారం ఉభయగోదావరి జిల్లాలతో పాటు కోనసీమలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వరద ప్రభావిత గ్రామాలలో విష సర్పాల బెడద తీవ్రంగా కనిపిస్తుంది. సీజనల్ వ్యాధులు బెడద కూడా అంతే స్థాయిలో ఆందోళన కలిగిస్తుంది. ఏది ఏమైనాప్పటికీ కోనసీమ ప్రజల్ని వరద  కష్టాలు ఇంకా వెంటాడుతున్నాయి. 


సాయం అందడంలేదు


కోనసీమ జిల్లాల్లో వరద ప్రభావిత గ్రామాలలో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని అయితే ప్రభుత్వం చేస్తున్న సాయం అరకొరగా ఉందని,  ఇంకా పూర్తిస్థాయిలో ఆదుకోవాలని ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ.వి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు,  అధికారులు వరద ప్రభావిత గ్రామాల్లో కేవలం కొంత దూరమే వెళ్లి పరామర్శించి వస్తున్నారన్నారు. సాయం అందించడంలో కూడా శివారు ప్రాంతాలలో ఉన్న వారికి సాయం సరిగా అందడం లేదని,  ఇది సరిదిద్దుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వరదల్లో నీట మునిగిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయం ప్రభుత్వం నుంచి అందించాలని డిమాండ్ చేశారు.  ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఐ.పోలవరం మండలం పుగాకులంకలో వరద బాధితులను ఎమ్మెల్సీ పరామర్శించారు.