Women Reservation Bill: రాజ్యసభ, మండలిలోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయా సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రాజ్యసభలో గురువారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న విజయసాయి రెడ్డి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.


రాజ్యసభ, మండలిలో సభ్యులు తమ టర్మ్ అయిపోగానే రిటైర్ అవుతుంటారని, ఆయా సభల్లో ప్రతి రెండేళ్లకు ఖాళీలు ఏర్పడుతుంటాయని విజయసాయి రెడ్డి అన్నారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి.. రాజ్యసభను, రాష్ట్రాల శాసనమండలిలను విస్మరించడం తగదని చెప్పారు. కాబట్టి, రాజ్యసభ, మండళ్లలోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 80, 171లను సవరించాలని విజయసాయి రెడ్డి న్యాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. 


మహిళా రిజర్వేషన్ బిల్లు అత్యంత ప్రతిష్టాత్మకమైనది, చారిత్రాత్మకమైన బిల్లును సభలో ప్రవేపెట్టిన రోజును ప్రత్యేకంగా గుర్తించాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మాదిరిగానే.. చరిత్రలో మహిళల ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా సెప్టెంబర్ నెలను చారిత్రక మహిళా మాసంగా జరుపుకునేలా ప్రకటించాలని విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 


పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పిస్తున్న విషయాన్ని విజయసాయి రెడ్డి చెప్పారు. 1992లో రాజ్యాంగంలోని 73, 74 ఆర్టికల్స్ ను సవరించడం ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం చట్టబద్ధంగా నిర్దేశించిన 33 శాతానికి మించే పంచాయతీలు, స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యం కల్పించి మహిళా అభ్యున్నతి పట్ల చిత్తశుద్ధిని చాటుకుందని తెలిపారు. 


స్థానిక సంస్థల్లో 1,356 ఖాళీలు ఉండగా.. అందులో 688 స్థానాలను అంటే 51 శాతం స్థానాలను మహిళలతో భర్తీ చేసినట్లు రాజ్యసభలో విజయసాయి రెడ్డి తెలిపారు. 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల్లో ఏడింటిని మహిళలకు 53 శాతం మేర కేటాయించినట్లు చెప్పారు. అలాగే 26 జిల్లా పరిషత్ వైఎస్ ఛైర్మన్ పోస్టులు ఉంటే 15 పోస్టులను అంటే 58 శాతం మేర మహిళలకే కేటాయించినట్లు చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్లలో మొత్తం 36 మేయర్, డిప్యూటీ మేయర్ పోస్టుల్లో 50 శాతం.. అంటే 18 పోస్టుల్లో మహిళలనే నియమించామన్నారు.


58 అసెంబ్లీ సీట్లు మహిళలకు కేటాయించాల్సిందేనా ?


ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ సీట్లతోపాటు 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇందులో 58 అసెంబ్లీ టికెట్లు, 8 పార్లమెంట్ స్థానాలను మహిళలకే కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మెజార్టీ స్థానాలను పురుషులకే కేటాయించిన పార్టీలు మహిళా బిల్లుతో తెలుగు రాష్ట్ర రాజకీయాలు మొత్తం మారిపోనున్నాయి. శాసనసభల్లో మహిళలకు భారీగా ప్రాధాన్యం పెరగనుంది. అసెంబ్లీ సీట్లే కాకుండా మంత్రి వర్గంలోనూ మహిళలు మహరాణులు కానున్నారు. మహిళా బిల్లుతో  పురుషాధిపత్యానికి కొంత చెక్ పడనుంది. 


తొలిసారి బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టారు


చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు బిల్లు ఈనాటిది కాదు. తొలిసారి ఈ బిల్లును 1996లో అప్పటి ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్‌పేయీ హయాంలో నాలుగుసార్లు, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టారు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభలో 186-1 ఓట్ల తేడాతో ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగ్ లోనే ఉండిపోయింది. 2014లో లోక్‌సభ రద్దు కావడంతో అక్కడ బిల్లు మురిగిపోయింది. మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ వస్తున్న వేళ...కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల వేళ.. ఈ కీలక బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే.. లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి.