అమరావతి విషయంలో హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. సీఆర్డీఏ చట్టాన్ని ( CRDA ) ఫాలో కావాల్సిందేనని స్పష్టం  చేసింది. అంతే కాదు రైతులకు మూడు నెలల్లో ప్లాట్లు... మాస్టర్ ప్లాన్‌ని ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. అభివృద్ధిపై నివేదికను ఎప్పటికప్పుడు సమర్పించాలని కూడా స్పష్టం చేసింది. రాజధాని అవసరాలకు తప్ప భూములు దేని కోసం తాకట్టు పెట్టవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. మరి తర్వాత ఏం జరగబోతోంది ?  సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన మానుకుంటారా ? మరో రూపంలో ముందుకొస్తారా ? వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వీటన్నింటికీ క్లారిటీ లభిస్తుందా ?


మూడు రాజధానులపై జగన్ వెనక్కి తగ్గుతారా ?


అమరావతి ( Amaravati ) రైతులు వేసిన పిటిషన్లపై హైకోర్టు ( Highcourt ) చాలా విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఓ రకంగా మూడు రాజధానులు ( Three Capitals ) అనే మాటను ప్రభుత్వం ఇక చేసే అవకాశం లేకుండా చేసింది. ఇదంతా సీఆర్‌డీఏ చట్టం ద్వారా భూసమీకరణ చేసి.. రైతులతో చేసుకున్న ఒప్పందం ద్వారానే సాధ్యమయింది. ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించ లేదు. ఉల్లంఘిస్తే న్యాయస్థానాలు ( Courts ) ఊరుకోవు. మరి ఇప్పుడు సీఎంజగన్ ఏం చేయబోతున్నారు ? మూడు రాజధానుల ఆలోచన మానుకుని అమరావతిపైనే దృష్టి కేంద్రీకరిస్తారా ? అనేది మిలియన్ డాలర్ కశ్చన్‌గా మారింది. అయితే వైఎస్ఆర్‌సీపీ అమరావతి విషయంలో వ్యవహరిస్తున్న విధానం కానీ జగన్మోహన్ రెడ్డి ( CM Jagan ) ఆలోచనా సరళి కానీ అమరావతి విషయంలో ఒక్క శాతం కూడా పాజిటివ్‌గా లేదన్నది అందరికీ తెలిసిన విషయం. ఇలాంటి  పరిస్థితుల్లో సీఎం జగన్ అమరావతినే ఏకైక రాజధానిగా ఖరారు చేసి .. అభివృద్ధి చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. 


ఏపీ ప్రభుత్వం వద్ద ప్లాన్ బీ ఉందా ?


ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉన్నట్లే..  ప్రతి అవసరానికి ఓ ఐడియా ఉంటుంది. ఈ విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీలో ఏర్పడినప్పటి నుండి అనేక అంశాల్లో స్పష్టమయింది. ఇప్పుడు మూడు రాజధానులు అనేది సాంకేతికంగా సాధ్యం కాదని తెలిపోయింది. అదితెలిసే మూడు రాజధానుల బిల్లులు, సీఆర్డీఏ బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆ బిల్లులపై విచారణ ముగించేస్తే తర్వాత మరో పద్దతిలో బిల్లు పెట్టాలని ప్రభుత్వం అనుకుంది.  ఓ రాజధాని రెండు ఉప రాజధానులు, లేకపోతే భిన్నమైన పేర్ల ద్వారా మూడు రాజధానులను తేవాలని అనుకుందన్న ప్రచారం జరిగింది. ప్రభుత్వం వద్ద ఎలాంటి వ్యూహాలున్నాయన్నదానిపై స్పష్టత లేదు. కానీ ప్రభుత్వం వద్ద ఖచ్చితంగా ప్లాన్ బీ ఉందనే రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. హైకోర్టులో తీర్పు సానుకూలంగా వచ్చే అవకాశం లేదనే అవగాహన ఉంది కాబట్టే  బిల్లులు వెనక్కి తీసుకున్నారు.. ఇప్పుడు చట్టానికి దొరక్కుండా మరోసారి అలాంటి ప్రయత్నం  చేసే అవకాశాన్ని కొట్టి పారేయలేమని  అంచనా వేస్తున్నారు.


ఇప్పటికీ ప్రభుత్వం వద్ద ఓ ఆప్షన్ ఉంది.. అదీ చట్ట ప్రకారమే !


చట్టబద్దంగా  మూడు రాజధానులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి  ఒకే ఒక మార్గం ఉంది.  సీఆర్‌డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందంలో 9.14 ఫాంలోని 18వ షరతు ప్రకారం.. ప్రభుత్వం ఏ షరతునైనా ఉల్లంఘిస్తే 2013 చట్టం కింద పరిహారమివ్వాలని పేర్కొన్నారు. భూసమీకరణ విధానంలో భూములు తీసుకున్నప్పుడు రైతులు మొదటి పార్టీగా, ప్రభుత్వం రెండోపార్టీగా పేర్కొంటూ ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంలోని 18వ షరతులో…" షెడ్యూలు ఆస్తిపై అభివృద్ధి పనులు నిలుపుదల చేయాలని మొదటి పార్టీ కోరరాదు. అదేవిధంగా రెండో పార్టీ.. అంటే ప్రభుత్వం కనుక ఒప్పందం ఉల్లంఘిస్తే నష్టపరిహారం.. చట్టప్రకారం అర్హమైన నష్టపరిహారాలు పొందుటకు అర్హులై ఉన్నారు.." అని పేర్కొన్నారు. దీనిప్రకారం రాజధానిని తరలించి.. రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. న్యాయపరంగా ఒప్పందాల్ని ఉల్లంఘిస్తే… 2013 భూసేకరణ చట్టం ప్రకారం ..   రైతుల నుంచి సమీకరించిన 33వేల ఎకరాలకు సుమారు రూ. 72వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇంత మొత్తం చెల్లిస్తే రాజధానులను ఏర్పాటు చేయవచ్చు. కానీ ప్రభుత్వానికి ఇంత ఆర్థిక వెసులుబాటు లేదు. 


అమరావతిని అంగీకరించి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అనడమే పెద్ద సమస్య !


అమరావతిని రాజధానిగా సీఎం జగన్ అంగీకరించారు. అసెంబ్లీలో కూడా మద్దతు తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రచారసభల్లో అమరావతే రాజధాని అన్నారు. తీరా గెలిచిన తర్వాత బోస్టన్ కమిటీ అని.. బోత్స కమిటీ అని.. దక్షిణాఫ్రికా అనే దేశంలో మూడు రాజధానులు ఉన్నాయని విధానాన్ని మార్చేసుకున్నారు. ఇది ప్రజల్ని వంచించడమేనన్న విమర్శలు వచ్చాయి. రైతుల్ని మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. అయినా పట్టించుకోలేదు. ముందుకెళ్లారు. న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగిలాయి.  
 


ఎన్నికల ఎజెండా చేసుకునే వ్యూహంతో వెనుకడుగు వేస్తారా  ?



ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఓ రకంగా ఎన్నికల వేడి కనిపిస్తోంది. ప్రతిపక్షం ముందస్తు ఎన్నికలు వస్తాయని చెబుతోంది.  వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ అదే ఆలోచనలో ఉన్నారని కూడా ఢిల్లీ స్థాయిలో మీడియాకు లీకులు వస్తున్నాయి. ఒక వేళ ముందస్తుకు వెళ్లినా వెళ్లకపోయినా ఇప్పుడు ఎన్నికల సీజన్. ప్రభుత్వం ప్రజాభిప్రాయం కోరేందుకు వెళ్లే సమయంలో తమను తాము కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మూడు రాజధానులను నిర్ణయించినప్పుడు ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయం తీసుకోవాలని ప్రతిపక్షాలు సవాల్ చేశాయి. కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు ఇదే అంశాన్ని ఎన్నికల ఎజెండాగా చేసుకుని వెళ్లాలనుకుంటే వ్యూహాత్మకంగా వెనుకడుగు వేసే అవకాశం ఉంది. అమరావతిని అభివృద్ధి చేయకపోయినా.. తమకు మళ్లీ అధికారం ఇస్తే మూడు రాజధానులు చేస్తామన్న అంశంతో ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది.  అప్పుడూ ఇప్పుడు వచ్చినట్లుగా న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయి.  కానీ అధిగమించే వ్యూహాలు కూడా ఖరారు చేసుకోవచ్చు.