బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కారణంగా.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కుస్తున్నాయి. కళింగపట్నానికి ఈశాన్య దిశలో 440 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం సాయంత్రం గోపాల్‌పుర్‌-కళింగపట్నం మధ్య తీరం దాటనుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ‘ఆరెంజ్‌’ హెచ్చరికలను జారీ చేసింది.


గులాబ్ తుపాన్‌ ప్రభావం ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగిలిన కోస్తా జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీర ప్రాంతాల్లో గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. రాగల 24 గంటల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, దక్షిణ కోస్తా జిల్లాలతోపాటు తెలంగాణ, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రపు అలల తీవ్రత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.


తుపాను హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. మత్స్యకార కుటుంబాలను అప్రమత్తం చేసి, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 86 వేల మందిని షెల్టర్లకు తరలించాల్సిందిగా సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు.


తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్


రానున్న 3 రోజులు తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తుపాను వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అవసరమైతే తప్ప జనం ఎవరూ బయటకు వద్దని అధికారులు సూచిస్తున్నారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 


Also Read: Tollywood Vs Jagan : టాలీవుడ్‌పై ఏపీ ప్రభుత్వం పగ సాధిస్తోందా ? పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం ఏమిటి ?


Also Read: Pawan Kalyan: సినిమా మేం తీస్తే, టికెట్లు మీరు అమ్ముతారా... సిని ఇండస్ట్రీ జోలికి వస్తే ఊరుకోను .. ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు