Weather Report: బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణశాఖ ప్రకటించింది. ఈ వాయుగుండం ప్రస్తుతానికి చెన్నై(Chennai)కి 840 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వాయుగుండం 18 కి.మీ వేగంతో ఉత్తర తమిళనాడు తీరం వైపు కదులుతోంది. ఉత్తర తమిళనాడు(Tamilnadu) తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ(Rayalaseema)లో వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు వెల్లడించారు. వాయుగుండం తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.






ఏపీపై తక్కువ ప్రభావం


దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిందని ఐఎండీ పేర్కొంది. ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. వాయుగుండం శ్రీలంకలోని ట్రింకోమలికి 360 కి.మీ, తమిళనాడులోని నాగపట్నానికి 700 కి..మీ, పుదుచ్చేరికి 760 కి.మీ, చెన్నైకు 840 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. రాగల 48 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ శ్రీలంక తూర్పు తీరం వెంబడి ఉత్తర తమిళనాడు వద్ద తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మార్చిలో తీవ్ర వాయుగుండం, తుపాను ఏర్పడటం చాలా అరుదుగా అని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. గడిచిన 200 ఏళ్లలో కేవలం 11 సార్లు మాత్రమే తుపాన్లు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 1994లో బంగాళాఖాతంలో స్వల్ప తుపాను వచ్చినట్లు పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండదని వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో రేపు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది.  


Also Read: Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా