Cyclone Michaung Latest News: దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాను (మిషాంగ్) గత 6 గంటల్లో 11 కి.మీ వేగంతో ఉత్తరం వైపుగా కదిలి గరిష్ఠంగా 90-100 kmph గాలి వేగంతో తీవ్రమైన తుఫానుగా నిన్న 5 డిసెంబర్ 2023, మధ్యాహ్నం 12.30 నుండి 14.30 గంటల సమయంలో బాపట్లకు దక్షిణంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. ఇది ఈరోజు 14.30 గంటల సమయానికి దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌ వద్ద 15.8°N అక్షాంశం, 80.3°E రేఖాంశం సమీపంలో బాపట్లకు నైరుతి దిశలో 15 కి.మీ. ఒంగోలుకు ఈశాన్యంగా 40 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. వచ్చే 2 గంటల్లో ఈ ఇది దాదాపు ఉత్తరం వైపు కదులుతూ తుఫానుగా బలహీనపడే అవకాశం ఉంది.


దీని ప్రభావంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి పొడి వాతవరణం ఏర్పడే అవకాశం ఉంది.


వాతావరణ హెచ్చరికలు (Weather Warnings)
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుండి అతిభారీ మరియు  అత్యంత భారీ వర్షాలు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ మరియు హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ  భారీ నుండి అతిభారీ వర్షాలు, జయశంకర్ భూపాలపల్లె, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, నల్గొండ జిల్లాలలో అక్కడక్కడ  భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మి. వేగంతో వీచే అవకాశం వుంది.


కొన్ని జిల్లాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన తెలికపాటి నుండి మోస్తారు వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 30 నుండి 40  కి.మి. వేగంతో వీచే అవకాశం వుంది. రేపు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి.మి. వేగంతో వీచే అవకాశం వుంది.


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
ఏపీలో భారీ నుంచి అతి భారీ, అత్యంత  భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో ఈ పరిస్థితి ఉండవచ్చు. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 45 నుంచి 55 కిలో మీటర్లు గరిష్ఠంగా 70 కిలో మీటర్ల వేగంతో వీస్తాయి.


దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో భారీ నుంచి అతి భారీ, అత్యంత  భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 90 నుంచి 100 కిలో మీటర్లు గరిష్ఠంగా 110 కిలో మీటర్ల వేగంతో వీస్తాయి.


రాయలసీమలో భారీ నుంచి అతి భారీ, అత్యంత  భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 45 నుంచి 55 కిలో మీటర్లు గరిష్ఠంగా 65 కిలో మీటర్ల వేగంతో వీస్తాయి.