Telangana New CM Revanth Reddy: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చడం ఒక్క ఇందిరమ్మ రాజ్యం లోనే సాధ్యమన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు ఇచ్చిన జన్మదిన కానుక రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం అన్నారు.


‘తెలంగాణ పోరాట గడ్డపై కాంగ్రెస్ పార్టీ కొత్త శకాన్ని ప్రారంభించబోతోంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీని అధికారంలోకి తేవడానికి పీసీసీ ప్రెసిడెంట్​గా సారథ్యం వహించి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్​రెడ్డి ఎంపికవడం హర్షణీయం. అందుకు సోదరుడు రేంవత్​రెడ్డికి శుభాకాంక్షలు’ తెలిపారు నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 


‘పదేండ్ల రాష్ట్రంలో గత పాలకులు సంక్షేమాన్ని మరిచి ప్రజలకు అన్యాయం చేశారు. ప్రజలు అవన్నీ గుర్తుంచుకున్నారు. అందుకే చరిత్రాత్మక తీర్పునిచ్చి, కాంగ్రెస్​కు అధికారం ఇచ్చారు. అయితే కాంగ్రెస్​ పార్టీలో సీఎం క్యాండిడేటే లేరని బీఆర్ఎస్ లాంటి ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేశాయి. కానీ, కాంగ్రెస్​ పార్టీలో నాటి నుంచి నేటి వరకూ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ప్రజాస్వామిక విధానాలే అమలవుతాయన్నది వాస్తవం. అందుకు ఉమ్మడి కార్యచరణ, ఉమ్మడి నిర్ణయాలే పార్టీకి బలం. ఇదే సిద్దాంతాలతో కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకొని, అదిష్టానానికి తీర్మాణం పంపారు.  


కాంగ్రెస్​ పార్టీలో ప్రజాస్వామ్యానికి, పార్టీలో ప్రతి నాయకుని ఉమ్మడి నిర్ణయానికి ఇచ్చే ప్రధాన్యానికి ఇది సంకేతం. ఈ ప్రజాస్వామ్యమే ఉత్తమ ప్రజా పాలనకు దోహద పడుతుంది. సోదరుడు రేవంత్​రెడ్డి సారథ్యంలో పాలకవర్గం ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తెలంగాణలో ప్రజాస్వామిక, ప్రజాఅనుకూల ప్రభుత్వ పాలన రాబోతోంది. కాంగ్రెస్​ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంలో పార్టీ కట్టుబడి ఉంటుంది. సోదరుడు రేవంత్​రెడ్డికి మరోసారి కృతజ్ఞతలు’ అని ఓ ప్రకటన విడుదల చేశారు.