నిన్న ఉత్తర ఛత్తీస్ గఢ్ నుండి ఉన్న ద్రోణి/గాలి విచ్చిన్నతి, ఈ రోజు విదర్భ నుండి మరత్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు: 
రాగల మూడు రోజులు తెలంగాణ  రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 


Weather Warnings: వాతావరణ హెచ్చరికలు
ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో  కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది. రాగల 5 రోజులు ఎల్లో అలర్ట్ ఉంటుందని వాతావరణ అధికారులు వెదర్ బులెటిన్‌లో తెలిపారు.


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.9 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 61 శాతం నమోదైంది.


ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలో చాలా కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు లాంటి వాతావరణంతో పాటు బలమైన గాలులు దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకూ వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాలోని అన్ని జిల్లాల్లో ఈ రకమైన వాతావరణం ఉంటుందని తెలిపారు. వచ్చే 5 రోజుల పాటు ఇదే రకం వాతావరణ పరిస్థితి ఉంటుందని తెలిపారు.


రాయలసీమలో ఎండలు విపరీతంగా
‘‘రాయలసీమలో ఎండలు విపరీతం అవ్వనున్నాయి. నేడు అత్యధికంగా కర్నూలు నగరంలో 40.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. కర్నూలుతో పాటుగా చిత్తూరు, కడప​, అనంతపురం, సత్యసాయి, నంద్యాల​, అన్నమయ్య జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. కర్నూలు మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశం వ్యాప్తంగా ఎండల తీవ్రతలో నేడు అగ్ర స్థానాన్ని సంపాదించుకుంది.


నేడు కూడా అక్కడక్కడ వర్షాలు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 6/7 నుంచి తెలంగాణలో వర్షాలు మొదలయ్యే సూచనలు కనబడుతూ ఉన్నా, మరో నాలుగు రోజులు మాత్రం కోస్తాంధ్రలో వర్షాలు కొనసాగనున్నాయి. నేడు సముద్రానికి దగ్గరగా ఉన్న భాగాల్లో వర్షాలు, పిడుగులు మధ్యాహ్నం మొదలై సాయంకాలం లేదా రాత్రి మొదలయ్యే వరకు కొనసాగనుంది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ​, కొనసీమ​, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్.టీ.ఆర్., గుంటూరు, బాపట్ల​, ప్రకాశం (కోస్తా ప్రాంతం మాత్రమే), నెల్లూరు (కోస్తా ప్రాంతం మాత్రమే), తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా (తూర్పు భాగాలు మాత్రమే) అక్కడక్కడ నేడు వర్షాలు చూడగలము. నేడు గత రెండు వారాలతో పోలిస్తే తక్కువ శాతం వర్షాలే ఉంటాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ విశ్లేషించారు.