దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా పశ్చిమ మరియు వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం (జూన్ 14) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో వడగాలులు అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ఈ రోజు అదిలాబాద్, ఖమ్మం, ములుగు, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, కొత్త గూడెం, సూర్యాపేట, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 27 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 57 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఏపీలోని కొన్ని తీర ప్రాంత జిల్లాల్లో వడగాలులు ఉంటాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీ అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, యానం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వడగాడ్పులు కొన్ని ప్రాంతాల్లో రానున్నాయి. వీటిలో కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం కాస్త తీవ్ర స్థాయిలోనే (ఆరెంజ్ అలర్ట్) వడగాడ్పులు వీయనున్నాయని అధికారులు అంచనా వేశారు.
అంతేకాకుండా ఈ తీర ప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులు కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయని, బలమైన గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కొన్ని ప్రాంతాల్లో వీస్తాయని వెల్లడించారు.
బిపర్జోయ్ తుపాను అప్ డేట్స్
అరేబియా సముద్రంలో కల్లోలం రేపుతున్న బిపర్జోయ్ తీవ్ర తుఫాను ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ ఈస్ట్ సెంట్రల్ అరేబియా సముద్రంలో ఏర్పడి నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతోంది. జూన్ 15న అతి తీవ్రమైన తుఫానుగా సౌరాష్ట్ర-కచ్, ఆనుకుని ఉన్న పాకిస్థాన్ తీరానికి చేరుకునేందుకు బలమైన అవకాశం ఉంది. ఆ తర్వాత అది ఈశాన్య దిశగా వెళ్లి క్రమంగా బలహీనపడుతుంది.
జూన్ 16న తుఫాను బలహీనపడుతుంది
ఇది బలహీనపడి జూన్ 16న నైరుతి రాజస్థాన్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. జూన్ 16న దీని ప్రభావంతో జోధ్ పూర్, ఉదయ్ పూర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో, నైరుతి రాజస్థాన్‌లో గాలుల వేగం గంటకు 45 నుండి 55 కి.మీ నుండి 65 కి.మీ వేగంతో నమోదయ్యే అవకాశం ఉంది.