Birds V Formation: ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చాలా మంది చూసే ఉంటారు. గుంపు గుంపులుగా ఎగిరే పక్షులు చూస్తుంటే.. మనం కూడా అలా ఆకాశంలో విహరించాలని చాలా మంది కోరుకుంటారు. ఆకాశంలో పక్షులు 'V' ఆకారంలో ఎగురుతాయని కూడా చాలా మంది గమనించే ఉంటారు. అయితే అలా పక్షులు 'V' ఆకారంలో ఎందుకు ఎగురుతాయి అనే విషయం చాలా మందికి తెలియదు? అసలు పక్షులు అలా 'V' ఆకారంలో ఎందుకు ఎగురుతాయి.. అలా ఎగరడం వెనక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఏరోడైనమిక్స్:


'V' ఆకారం ఏరోడైనమిక్స్ సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ ఆకారంలో ఎగరడం వల్ల మరింత సమర్థంగా ముందుకు కదలవచ్చు. పక్షి తన రెక్కలను తిప్పినప్పుడు, అది దాని వెనక సుడిగుండం సృష్టిస్తుంది. ఈ సుడిగుండం పక్షిని పైకి లేపడానికి ముందుకు సాగడానికి సహాయపడుతుంది. వరుసలో ఉన్న తదుపరి పక్షి అదే మార్గంలో ఎగిరినప్పుడు, ఈ సుడిగుండం శక్తి వెనక వచ్చే పక్షిపై పడుతుంది. ఇది ఎగరడానికి మరింత శక్తిని ఖర్చు చేస్తుంది.


కమ్యూనికేషన్:


పక్షులు 'V' ఆకారంలో ఎగరడానికి మరొక కారణం ఏంటంటే.. అవి ఒకదానితో ఒకటి కమ్యూనికేషన్ చేసుకుంటాయి. 'V' ఆకారంలో ఎగురుతున్నప్పుడు ఒకదానికొకటి చూసుకోగలవు. చాలా దూరం వలస పోతున్న సమయంలో ఇది చాలా కీలకం.


భద్రత:


'V' ఆకారంలో పక్షులు ఎగరడం వల్ల అవి మరింత ఎక్కువ సురక్షితంగా ఉంటాయి. 'V' ఆకారంలో ఉన్న పక్షులు వేటాడే జంతువులను అన్ని వైపుల నుంచి గమనించగలవు. ఒక పక్షి ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తే ఇతర పక్షులు సాయం చేస్తాయి.


నాయకత్వం:


'V' ఆకారంలో ముందున్న పక్షి ఆ గుంపు అంతటికి నాయకత్వం వహిస్తుంది. ఈ పక్షికి తన గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని సుదూర ప్రాంతాలకు కూడా వెళ్లగలిగే నేర్పు సంపాదిస్తుంది. అలాంటి పక్షి 'V' ఆకారంలో ముందు ఉంటూ నాయకత్వం వహిస్తుంది.


శక్తి వినియోగం తగ్గుతుంది:


'V' ఆకారంలో ఆకాశంలో ఎగురుతున్నప్పుడు గాలిని చీల్చుకుంటూ ముందుకు సాగుతాయి. ఈ ఏరోడైనమిక్ సూత్రం వల్ల పక్షులు ఎగిరేందుకు తక్కువ శక్తి ఖర్చు అవుతుంది. అయితే పక్షులు పుట్టుకతోనే ఈ కళను కలిగి ఉండవని పరిశోధకులు చెబుతున్నారు. పెరుగుతున్న క్రమంలో, గుంపులో ఉంటూ ఇతర ప్రాంతాలకు, సుదూర యాత్రలు చేస్తున్నప్పుడు ఇతర పక్షుల నుంచి ఈ కళను నేర్చుకుని జీవితాంతం ఆచరిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. 


పోటీ ఉండదు, సమానత ఉంటుంది:


'V' ఆకారంలో పక్షులు ఎగురుతుంటే ముందు భాగంలో ఓ పక్షి ఉంటుంది. ఈ నాయకత్వ స్థానంలో ఉన్న పక్షి పూర్తిగా అనుభవం ఉన్న, దారి తెలిసిన పక్షి అయి ఉంటుంది. ఈ స్థానం సంపాదించడానికి పక్షుల మధ్య ఎలాంటి పోటీ ఉండదు. అలాగే ముందు ఉన్న పక్షులు, వెనక ఉన్న పక్షులకు మధ్య ఎలాంటి భేదం, వ్యత్యాసం లాంటివి ఉండవు. గుంపులో ఉన్న పక్షులు అన్నీ సమానత్వాన్ని పాటిస్తాయి.