బంగాళాఖాతంలోని నైరుతి భాగంలో మొన్న (నవంబరు 9) ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం బలపడి అల్ప పీడనంగా మారింది. నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను ఆనుకొని ఇది ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది క్రమంగా వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని, తమిళనాడు - పుదుచ్చేరి తీరాల వైపు వస్తుందని అంచనా వేశారు. అయితే, దీని ప్రభావం తమిళనాడుపై అధికంగా ఉండగా ఏపీలో కాస్త తక్కువగా ఉండనుందని అధికారులు చెప్పారు. 


దక్షిణ కోస్తాంధ్రకు వర్ష సూచన
ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో మాత్రం భారీ నుంచి అతి భారీ వానలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. దక్షిణ కోస్తాలో గంటకు 65 కి.మీల వేగంగా గాలులు వీస్తాయని తెలిపారు. ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. శుక్రవారం (నవంబరు 11), శనివారం రెండు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.


ముఖ్య నగరాలైన వైజాగ్, విజయవాడలో అల్పపీడనం అంతగా ప్రభావం చూపకపోవచ్చు. నవంబర్ 12 నుంచి 15 తేదీల్లో ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గాలులు వీచడంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఈశాన్య రుతుపవనాలు ఏపీలో పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నాయి. నేడు ఉత్తర కోస్తాంధ్రలో, యానాంలో ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో వాతావరణం పొడిగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.


నవంబర్ 12 నుంచి అల్పపీడనం ప్రభావం తిరుపతి, నెల్లూరు జిల్లాలతోపాటుగా కడప, అన్నమయ్య, చిత్తూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల మీదుగా ఉండనుంది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో 13న వర్షాలు కురవనున్నాయి.


దక్షిణ కోస్తాంధ్ర - తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టుప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు కింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు.


నెల్లూరులో అధికారుల హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తీవ్ర పెనుగాలులు, భారీవర్షం వచ్చే అవకాశం ఉందని వెంకటగిరి మున్సిపల్‌ కమిషనర్‌ గంగాప్రసాద్‌ గురువారం (నవంబరు 10) ఓ ప్రకటనలో హెచ్చరించారు. లోతట్టుప్రాంతాల ప్రజలు, పాత భవనాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పారు. మున్సిపల్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని, సహాయం కావాల్సిన వారు 9110564575, 08625-295015, 9849905894 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.


తెలంగాణలో పరిస్థితి ఇలా..
హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేసిన వెదర్ బులెటిన్ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉంటుంది. ఎక్కడా వర్ష సూచన లేదు. వచ్చే 3 రోజులు ఇలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 






హైదరాబాద్ లో ఇలా..
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది, గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశల నుంచి గాలులు 3 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. నిన్న మాత్రం గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30.0 డిగ్రీలు, 17.5 డిగ్రీలుగా నమోదైంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.