ట్విట్టర్‌ని టేకోవర్ చేసుకున్న తర్వాత, కొత్త బాస్ ఎలాన్ మస్క్ కంపెనీ ఉద్యోగులకు తన మొదటి ఈ-మెయిల్‌ను పంపాడు. ఇక వర్క్ ఫ్రం హోం లేదని ఇందులో తెలిపారు. ట్విట్టర్ ఉద్యోగులు వారానికి కనీసం 40 గంటల పాటు కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని మస్క్ మెయిల్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. "సందేశాన్ని షుగర్‌కోట్ చేయడం లేదు" అని మస్క్ పేర్కొన్నట్లు నివేదిక జోడించింది.


గత వారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ దాదాపు సగం మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత ట్విట్టర్ ఉద్యోగాలు కోల్పోయిన డజన్ల కొద్దీ ఉద్యోగులను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. తిరిగి రావాలని కోరిన వారిని పొరపాటున తీసేశామని చెప్తున్నట్లు తెలుస్తోంది. మస్క్ ఊహించిన కొత్త ఫీచర్లను రూపొందించడానికి తొలగించాలనుకున్న వారిలో కొందరి అనుభవం అవసరమని మేనేజ్‌మెంట్ గ్రహించకముందే వారిని తీసేశారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.


సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ గత వారం ఈమెయిల్ ద్వారా దాదాపు 3,700 మంది ఉద్యోగులను తొలగించింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన అనంతరం ఖర్చులను తగ్గించే ప్రయత్నంలో ఉంది. ఈ-మెయిల్, స్లాక్ వంటి కంపెనీ సిస్టమ్‌లకు యాక్సెస్‌ను అకస్మాత్తుగా సస్పెండ్ చేసిన తర్వాత చాలా మంది ఉద్యోగులు ఈ నిర్ణయం గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు కొందరిని తిరిగి రమ్మనడం ఉద్యోగులను తొలగించే విషయంలో కంపెనీ ఎంత అస్తవ్యస్తమైన ప్రక్రియను పాటించిందో తెలుపుతుంది.


"ట్విట్టర్ కంపెనీ రోజుకు 4 మిలియన్ డాలర్లకు పైగా నష్టపోతున్నప్పుడు మరో ఆప్షన్ లేదు." అని ట్విట్టర్ కొత్త సీఈవో ఎలాన్ మస్క్ గతంలో ట్వీట్ చేశారు. ట్విటర్‌లో ప్రస్తుతం దాదాపు 3,700 మంది వరకు ఉద్యోగులు మిగిలి ఉన్నారు.


వీరిని ఎలాన్ మస్క్ కొత్త ఫీచర్‌లను అమలు చేయడానికి కంపెనీలో ఉంచారు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులు టార్గెట్లను చేరుకోవడానికి కార్యాలయంలోనే పడుకున్నారు. "పేరడీ అని స్పష్టంగా పేర్కొనకుండా ఎవరైనా మరొకరి ట్విట్టర్ హ్యాండిల్‌ను అనుకరించే ఖాతా తెరిస్తే దాన్ని శాశ్వతంగా నిలిపివేస్తాం." అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు.