Srinivas Kalyanam : యూకే, యూరప్ దేశాలలో  అంగరంగ వైభవంగా టీటీడీ శ్రీనివాస కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. అంతేకాదు మరో మూడు నగరాలలో ఘనంగా దేవదేవుడి కళ్యాణం నిర్వహించారు. యూకే, యూరోప్ లలో ఘనంగా జరుగుతున్న శ్రీనివాస కళ్యాణోత్సవాలపై  ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ ఎస్. మేడపాటి విడుదల చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణోత్సవాలు గత వారంలో మూడు నగరాలలో జరిగాయి. నవంబర్ ౩వ తేదీన  జర్మనీలోని మునిక్, 5వ తేదీన ఫ్రాంక్ఫర్ట్  6వ తేదీన ఫ్రాన్స్ లోని పారిస్ నగరాలలో తితిదే నుంచి  వెళ్లిన అర్చకులు, వేదపండితులు శ్రీనివాసుడి కళ్యాణం వైఖానస ఆగమం ప్రకారం ఘనంగా నిర్వహించారు. ఇప్పటి వరకు 9 నగరాలలో శ్రీవారి కళ్యాణాలు జరిగాయి. మునిక్ నగరంలో వారం మధ్యలో శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.  


జర్మనీలో 


జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ లో జరిగిన శ్రీవారి కళ్యాణంలో జర్మనీలో భారత రాయబార కార్యాలయం అంబాసిడర్  పర్వతనేని  హరీష్ దంపతులు, స్థానిక మేయర్ పాల్గొన్నారు. కళ్యాణాన్ని తిలకించి, మాటల్లో వర్ణించలేని అనుభూతి కలిగిందని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పచ్చని ప్రకృతి, కొండల నడుమ, ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీవారి కళ్యాణం జరిగింది.  ఈ సందర్భంగా  సీఎం జగన్ కు, తితిదే చైర్మన్ వై.వీ సుబ్బారెడ్డికు వారు ధన్యవాదాలు తెలిపారు. పారిస్ లో జరిగిన కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు ఇది చిరకాలం గుర్తుండిపోతుందని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర సెంటర్  (ఫ్రాన్స్) సభ్యులు  కన్నాబిరెన్ మాట్లాడుతూ...గతంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించినప్పటికీ ఇంతపెద్ద ఎత్తున స్వామి వారి కళ్యాణం జరగడం ఇదే మొదటిసారి అన్నారు.  మాటల్లో వర్ణించలేని మహత్తర కార్యక్రమమని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కళ్యాణోత్సవంలో అధిక సంఖ్యలో తమిళ, పాండిచ్చేరి భక్తులు హాజరయ్యారు. ప్రవాసులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని వీక్షించి ఆశీర్వాదాలు అందుకున్నారు. అన్ని నగరాలలో  భక్తులందరికీ తిరుమల నుంచి తెచ్చిన లడ్డూ ప్రసాదం అందించారు.  వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ...కళ్యాణోత్సవ క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన  ఆరాధన, అంకురార్పణ, మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారన్నారు. ఈ వీకెండ్ లో  12వ తేదీన పెద్దఎత్తున ఇంగ్లాండ్ లోని లండన్, 13 వ తేదీన స్కాట్లాండ్ లోని ఎడిన్బర్గ్ లో కళ్యాణోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. దీంతో యూకే, యూరప్ దేశాలలోని 11 నగరాలలో దేవదేవుడి కళ్యాణోత్సవాలు ముగుస్తాయని వివరించారు.


తెలుగు తనం ఉట్టిపడేలా కార్యక్రమాలు 


కన్నులపండుగలా జరుగుతున్న ఈ కళ్యాణోత్సవాల్లో ఆయా నగరాల్లోని తెలుగు, భారతీయ, ధార్మిక సేవా సంస్థలు భక్తులకు ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కళ్యాణోత్సవ కార్యక్రమంలో ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఏఈవో వెంకటేశ్వర్లు, యూకే తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు  కిల్లి సత్య ప్రసాద్, శివాలయం ఈ.వీ. సెంటర్ నుంచి  శర్మ , మన తెలుగు అసోసియేషన్ సభ్యలు, ఇతరులు పాల్గొన్నారు.