ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నవంబర్ 15న (నేడు) తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్ర మట్టానికి 3 .6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. తాజా అల్పపీడనం జవాద్ తుపానుగా మారనుందని, దీని ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలపై ఉండనుంది. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
దక్షిణ అండమాన్ లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. నవంబర్ 18 నాటికి ఏపీ తీరానికి చేరనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలు, ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం కారణంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచానా వేశారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తమిళనాడులోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. జలాశయాలు నిండుకుండలా మారుతున్నాయి.
Also Read: AP Municipal Elections: ఏపీలో మునిసిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీల ఎన్నికలు ప్రారంభం..
తాజాగా ఏర్పడిన వాయుగుండం జవాద్ తుపానుగా మారనుండటంతో ఏపీ, తమిళనాడులకు మరో ముప్పు పొంచి ఉండొచ్చునని వాతావరణశాఖ అంచనా వేసింది. తమిళనాడుతో పాటు కొస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. జవాద్ ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. తీర ప్రాంతాలపై దీని ప్రభావం అధికంగా ఉండనుంది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఏపీ, తెలంగాణ, తమిళనాడుతో పాటు ఒడిశా, దక్షిణ చత్తీస్ గఢ్ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
Also Read: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. స్థిరంగా వెండి.. తాజా రేట్లు ఇలా..
తెలంగాణలో నేడు, రేపు రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రం నుంచి ఉపసంహరించుకున్నా.. అల్ప పీడనం, వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. తూర్పు మద్య అరేబియా సముద్ర ప్రాంతాల నుంచి తెలంగాణ వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ద్రోణి బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు.