ఏపీలో నిన్న మిగిలిన సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలు జరగగా.. నేడు నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు పలు మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, వివిధ మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డులు/డివిజన్లకు నేడు పోలింగ్ నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇందుకోసం పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్ర పోలీసు విభాగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది.
ఏపీలో 23 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 353 డివిజన్/వార్డులకు ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో 28 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 325 స్థానాలకు నేడు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అధికార వైఎస్సార్‌సీపీ నుంచి 325, టీడీపీ 306, జనసేన 92, బీజేపీ 90, ఇతర పార్టీల అభ్యర్థులు 98, స్వతంత్రులు 295 మంది పోటీ చేస్తున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిపి మొత్తం 1,206 మంది బరిలో ఉన్నారు.
Also Read: విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది... ఏడేళ్లైనా హామీలు అమలు కాలేదన్న సీఎం జగన్.. స్పందించిన అమిత్ షా
8.6 లక్షల ఓటర్లు..
నేడు జరుగుతున్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీల ఎన్నికలకు మొత్తం 908 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 349 సమస్యాత్మక, 239 అత్యంత సమస్యాత్మక, 38 సాధారణమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. 2,038 బ్యాలెట్ బాక్స్‌లలో 8,62,066 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వీడియో చిత్రీకరించే ఏర్పాట్లు సైతం చేశారు. ఈ ఎన్నికల్లో ఎలక్షన్ ఆఫీసర్లు, రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతరత్రా సిబ్బంది కలిపి మొత్తం 4 వేల మంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు.
అభ్యర్థుల మరణం, గతంలో ఆగినవి..
ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల మరణించడం, ఆగిపోయిన చోట్ల సైతం కార్పొరేషన్, మునిసిపాలిటీ వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 14 డివిజన్, వార్డులున్నాయి. విజయనగరంలో 1, విశాఖపట్నంలో 2, కాకినాడలో 4, ఏలూరు 1, గంటూరులో 1, అనంతపురంలో 1, కొవ్వూరు 1, నందికొట్కూరు 1, బద్వేలు 1, రేపల్లేలో 1 డివిజన్/వార్డులకు నేటి ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది.
Also Read: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. స్థిరంగా వెండి.. తాజా రేట్లు ఇలా..
వీడియో లింక్ అడిగిన టీడీపీ..
రాష్ట్రంలో కుప్పం నగర పంచాయతీ పరిధిలో నేడు జరగనున్న ఎన్నికల ప్రక్రియకు సంబంధించి వీడియో లింక్ కావాలని 24 వార్డుల్లో పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఎన్నికల్లో అవకతవకలు జరగకుండా చూసేందుకు, సాక్ష్యాల కోసం వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డు చేయడం వంటిది సాధారణమే కానీ పోలింగ్ బూత్‌లో జరిగే ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలని టీడీపీ నేతలు కోరడంపై ఎన్నికల అధికారులు ఆశ్చర్యపోయారు.