నిన్న దక్షిణ అండమాన్ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఒక అల్పపీడన ద్రోణి ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల నుంచి తమిళనాడు తీరం వరకు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో కొన్ని చోట్ల నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేశారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఎల్లుండి (గురువారం) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల పడే అవకాశం ఉంది.
Also Read: కడప జిల్లాలో కూలిపోయే స్థితిలో మరో బ్రిడ్జి... కుంగిన జమ్మలమడుగు-ముద్దనూరు వంతెన... రాకపోకలు బంద్
దక్షిణ కోస్తాంద్రలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన చిరు జల్లులు కొన్ని చోట్ల కురవనున్నాయి.
గత వారం రోజులుగా భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రాయలసీమలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
తెలంగాణలో వాతావరణం ఇలా..
తెలంగాణలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. తెలంగాణలో హైదరాబాద్ సహా కొన్ని జిల్లాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. వాతావరణం చల్లగా ఉంటుందని, పెద్దగా మార్పులేమీ ఉండవని, ఓ ప్రకటనలో తెలిపారు. మరో నాలుగైదు రోజులపాటు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురవనున్నాయి.
Also Read: వర్షాలు కారణంగా శ్రీవారి దర్శనం చేసుకోలేపోయిన వారికి టీటీడీ శుభవార్త
Also Read: ఒకే ఒక్కడు.. వెయ్యిమందిని కాపాడాడు.. కోవూరు ఎస్సైకి జనం జేజేలు