BC Hostel snake Bite: విజయనగరం జిల్లా కురుపాం(Kurupam) ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో పాము కాటుకు విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనపై బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ(Chelluboyina Srinivas Venugopala krishna) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్(BC Welface Residential School) లో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. పాము కాటుకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అసలేం జరిగిందంటే?
విజయనగరం జిల్లా కురుపాం మండలం కేంద్రంలో గురువారం అర్ధరాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో పాముకాటుకు గురై ఓ విద్యార్థి చనిపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. మరో ఇద్దరు చిన్నారులు కూడా పాము కాటు(Snake Bite) గురయ్యారు. మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్లో రాత్రి పూట నిద్రపోతున్న ముగ్గురు విద్యార్థులను పాము కాటేసింది. పాము కాటుతో ఈ ముగ్గురు విద్యార్థులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇది గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు. అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది పాముకాటుకు గురైన విద్యార్థులను 108 అంబులెన్స్ సహాయంతో పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విజయనగరం(Vizianagaram)లోని తిరుమల ఆస్పత్రికి తరలించారు. పాముకాటుకు గురైన ముగ్గురు విద్యార్థులు ఎనిమిదో తరగతి చదువుతున్న మంతిని రంజిత్, ఈదుబుల్లి వంశీ జీగారం, వంగపండు నవీన్ లుగా గుర్తించారు. ముగ్గురు విద్యార్థులు అపస్మారక స్థితిలో ఉండటంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Read Also : AP CM YS Jagan: పోలవరం పరిశీలనకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సీఎం జగన్
ఒక విద్యార్థి మృతి, మరో విద్యార్థి పరిస్థితి సీరియస్
పాము కాటుకు గురైన ముగ్గురు విద్యార్థుల్లో మంతిని రంజిత్ అనే విద్యార్థి చికిత్స పొందుతూ చనిపోయినట్లు జాయింట్ కలెక్టర్ డా.మహేష్ కుమార్ పేర్కొన్నారు. పాముకాటుకు గురైన వారిలో మరో విద్యార్థిని వెంటిలెటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరో విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి(Pushpa Srivani) పరామర్శించారు.