AP CM YS Jagan, Union Minister Gajendra Singh Shekhawat: అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శుక్రవారం పోలవరంలో పర్యటనకు వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను, పునరావాస కాలనీలను సీఎం జగన్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పరిశీలించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు 1 పునరావాస కాలనీకి చేరుకోనున్నారు. అక్కడ నిర్వాసితులతో సీఎం, కేంద్ర మంత్రి మాట్లాడతారు.
పోలవరం నిర్వాసితుల వద్దకు సీఎం
ఆ తర్వాత 11.20 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు. అక్కడి నుంచి 12.30 గంటలకు పోలవరం డ్యామ్ సైట్ చేరుకుని పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు పోలవరం డ్యామ్ సైట్ నుంచి తిరిగి బయలుదేరి 5.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
సీఎంగా 2019లో తొలిసారి..
వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా 2019 జూన్ 20న పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆపై పలుమార్లు పోలవరం పనులపై అధికారులు, మంత్రులతో సమీక్షలు నిర్వహించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఖజానాకు రూ.838 కోట్లను ఆదా చేసిటనట్లు ఏపీ ప్రభుత్వ అధికారులు చెబుతారు. టీడీపీ ప్రభుత్వం నామినేషన్ పద్ధతితో అధిక మొత్తంలో కట్టబెట్టిందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తుంటారు. నేడు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి వెళ్లనున్న వైఎస్ జగన్ పోలవరం పనులను 5వసారి క్షేత్రస్థాయిల పరిశీలించనున్నారు.
కరోనా సమయంలోనూ పోలవరం పనులను ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయలేదు. ఎగువ కాఫర్ డ్యామ్‌ను గత ఏడాది పూర్తి చేసింది. 2021 జూన్ 11న గోదావరి సహజ ప్రవాహాన్ని అప్రోచ్ చానల్, స్పిల్‌వే, స్పిల్ చానల్, పైలట్ చానల్ మీదుగా ఆరున్నర కిలోమీటర్ల పొడవున మళ్లించింది. 12 ప్రెజర్ టన్నెళ్ల తవ్వకం పనులను సైతం ఏపీ సర్కార్ తక్కువ సమయంలోనే పూర్తి చేసింది. ప్రస్తుతం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి జలవిద్యుత్ కేంద్రం పనులను పూర్తి చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: Amaravati What Next : మూడు రాజధానులకు ఇప్పటికీ ఓ మార్గం ! జగన్ ప్లాన్ బీ అమలు చేస్తారా ?
Also Read: Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా