Liquor Ban In AP : అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం విధిస్తామని జగన్ ఇచ్చి హామీల్లో ఒకటి. అధికారం చేపట్టిన తర్వాత ఈ నిర్ణయం తీసుకునేందుకు సీఎం జగన్ కాస్త ఆచీతూచి అడుగులు వేస్తున్నారు. మద్యం ధరలను రెట్టింపు చేసి మద్యం తాగేవాళ్ల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం మద్యపాన నిషేధం ఎప్పుడంటూ వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. దీనిపై తాజాగా ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం మద్యపాన నిషేధం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. మద్య నిషేధంపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. ఆదివారం విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన... కరోనా వల్ల ఏపీ ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదన్నారు. మద్య నిషేధం విషయంలో పరిశీలించి సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారన్నారు. మద్య నిషేధం నిర్ణయం తీసుకుంటే ఎన్ని షాపులు ఉన్నా మూతపడక తప్పదని వీరభద్ర స్వామి తెలిపారు.  


సైకిల్ పోవాలని చంద్రబాబే కోరుకుంటున్నారు


చంద్రబాబుపై డిప్యూటీ స్పీకర్ కోలగొట్ల వీరభద్ర స్వామి విమర్శలు చేశారు. కుప్పం స్థానిక ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు వైసీపీపై విమర్శలు చేయడం  హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన చంద్రబాబు.. తెలంగాణలో ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలు చంద్రబాబు కంటికి కనిపించలేదా అని విమర్శించారు. విజయనగరంలో చంద్రబాబు బస చేసిన బంగ్లాలోనే ఎన్టీఆర్‌పై కుట్రకు అంకురార్పణ జరిగిందన్నారు. చంద్రబాబు ఎన్ని పర్యటనలు చేసినా వైసీపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. పదేపదే సైకిల్ పోవాలి పోవాలని చంద్రబాబే స్వయంగా కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల వస్తే వైసీపీ గెలుస్తామో లేదో గానీ కుప్పంలో మాత్రం చంద్రబాబు గెలవరని జోస్యం చెప్పారు. వైసీపీ నేతలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడైనా భూములు కబ్జా చేస్తే చూపించాలని నిలదీశారు. మూడు రోజులుగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న టీడీపీ‌ అధినేత చంద్రబాబు నిరాధార ఆరోపణలతో పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. 


ఇసుక బ్లాక్ లో దొరకదు 


రాష్ట్రంలో ఇసుక దొరకడంలేదని చంద్రబాబు చేస్తున్న విమర్శలపై కోలగట్ల ఘాటుగా స్పందించారు.  బ్లాక్ మార్కెట్ లో ఇసుక దొరకదని స్పష్టం చేశారు. ప్రభుత్వమే నేరుగా ప్రజలకు అందిస్తున్నారన్నారు. జన్మభూమి కమిటీల అవినీతికి చూసి చంద్రబాబును ఇంటికి పంపారని విమర్శించారు. దిశ చట్టం ద్వారా మహిళలపై నేరాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నామన్నారు. విశాఖలో రాజధాని వద్దని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. విశాఖలో రాజధాని పెడితే రాష్ట్రం అభివృద్ధి చెంది వైసీపీ ప్రభుత్వానికి ఎక్కడ పేరు వచ్చేస్తుందని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతో విజయనగరంలో మళ్లీ అశోక్ గజపతిరాజుని తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏనాడైనా ఇంటింటికీ వెళ్లి అందించారా అని ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. హైదరాబాద్ లో ఉంటున్న చంద్రబాబు పబ్బం గడుపుకోడానికి ఉత్తరాంధ్ర వచ్చారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పై కుట్రకు స్కెచ్ వేసిన బంగ్లాలో ఉన్న చంద్రబాబు ఇవాళ మళ్లీ ఏం చెయ్యడానికి అక్కడే మకాం వేశారా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు.