Kaushal Kishore: మద్యం సేవించే అధికారికి పిల్లనివ్వడం కంటే రిక్షా పుల్లర్ లేదా కూలీకి ఇవ్వడం ఎంతో మేలని కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ అన్మారు. ఆడపిల్లలను మద్యపానం చేసేవారికి కట్టబెట్టొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్ లంభువా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన డి-అడిక్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
తాను ఎంపీగా తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా తమ కుమారుడి ప్రాణాలను కాపాడలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సామాన్య ప్రజలను ఎలా కాపాడగలనంటూ భావోద్వేగానికి గురయ్యారు.
80 శాతం క్యాన్సర్ మరణాలు పొగాకు, సిగరెట్లు, బీడీల వ్యసనానికి కారణమని ఆయన అన్నారు. డీ-అడిక్షన్ కార్యక్రమంలో ఇతర సంస్థలు కూడా భాగస్వాములు కావాలని, వారి కుటుంబాలను రక్షించాలని ఆయన కోరారు.
జిల్లాను వ్యసనా రహితంగా మార్చేందుకు డీ అడిక్షన్ క్యాంపెయిన్‌ను అన్ని పాఠశాలలకు తీసుకెళ్లాలని, ఉదయం ప్రార్థన సమయంలోనే పిల్లలకు దీనిపై సలహాలు ఇవ్వాలని మంత్రి సూచించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మోహన్‌లాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గానికి కిశోర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ములాయం సింగ్ యాదవ్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా ఆయన పని చేశారు. 2013లో భారతీయ జనతా పార్టీలో చేరి 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా తరపున పోటీ చేసి తొలిసారి మోహన్‌లాల్‌గంజ్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో రెండోసారి ఎంపీగా ఎన్నికై నరేంద్ర మోదీ మంత్రివర్గంలో గృహ, పట్టణ వ్యవహారాల శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Also Read: China Covid Surge: చైనాలో అల్లకల్లోలం- 20 రోజుల్లో 25 కోట్ల మందికి కొవిడ్!