టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తరచూ హైదరాబాద్‌కు అది తెచ్చామని, తన హాయాంలో ఇది ఏర్పాటు చేశామని అంటూ ఉంటారని ఎద్దేవా చేశారు. అలా గొప్పలు చెప్పుకోవడం కాదని.. ఆయన ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం అప్పట్లో ఏపీకి ఇచ్చిన సంస్థలు కాకుండా చంద్రబాబు సొంతంగా ఏం చేశారో చెప్పాలని అన్నారు. శనివారం (డిసెంబరు 25) విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడారు.


ఏపీలో అధికారం పోగానే చంద్రబాబు హైదరాబాద్‌ ఎందుకు వెళ్లిపోయారని జీవీఎల్‌ నరసింహారావు సూటిగా ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధి పట్ల శ్రద్ధలేదా అంటూ ప్రశ్నించారు. అధికారం కావాలంటే ఆంధ్రా జనాన్ని వాడుకోవాలి.. అది అయిపోయాక హైదరాబాద్‌లో ఆస్తులను పెంపొందించుకోవాలని ఎద్దేవా చేశారు. ఏపీ పట్ల చిత్త శుద్ధి లేదని, హైదరాబాద్‌లో సొంత ఆస్తులు ఉన్నాయనే, సొంత వ్యాపారాలు ఉన్నాయనే, బంధుగణం ఉందనో అక్కడే తిష్ఠ వేసుకుని కూర్చుంటున్నారని ప్రశ్నించారు. అవసరమైతే తెలంగాణలో రాజకీయాలు చేసుకోవాలని సూచించారు. 


సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఏపీలో ఐటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఏం చర్యలు చేపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీ ఉద్యోగులందరూ వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న వేళ సరిగ్గా ఇలాంటి సమయంలో సదరు కంపెనీలకు రాయితీలు ఇస్తే, వాటి కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటుచేసే అవకాశం ఉంటుందని జీవీఎల్‌ సూచించారు.


అధికారం పోయాక చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిపోయినట్లుగానే 2024 తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో కూర్చుంటారని ఎద్దేవా చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు రెట్టిపు కంటే జాతీయ రహదారులు వేశామని, బెంగళూరు - విజయవాడ జాతీయ రహదారి పనులు వచ్చే ఏడాది మొదలు పెడతామని అన్నారు. 


కేంద్ర ప్రభుత్వం ఏపీలో బయో టెక్నాలజీ పార్క్ ఇస్తామంటే రాష్ట్రం ముందుకు రావట్లేదని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. కాపు రిజర్వేషన్ పై కేంద్రాన్ని ప్రశ్నించామని, కానీ, రాష్ట్రంలో కాపులను బీసీల్లో చేర్చే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని చెప్పారు.


కుటుంబ పాలన అనేది దేశానికి పట్టిన చీడ అని జీవీఎల్ వ్యాఖ్యానించారు. కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమని, రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీని గద్దె దించడమే మా లక్ష్యమని అన్నారు. దుష్ట పరిపాలనకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందని, మూడున్నర ఏళ్లుగా ఓటు బ్యాంక్ రాజకీయాలే జరుగుతున్నాయని చెప్పారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయాయని అన్నారు. జాతీయ జీడీపీలో 9 శాతం ఐటీ రంగం నుండే వస్తుందని అన్నారు. అలాంటి ఐటీ రంగాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన మండిపడ్డారు.


భారత్ లో డిజిటల్ వండర్ అటల్ బిహారీ వాజ్‌పేయీ వల్ల మాత్రమే సాధ్యమయిందని జీవీఎల్ అన్నారు. భారత్లో అణుపరీక్షలు చేయించింది కూడా ఆయనేనని, గతంలో యూపీఏ ప్రభుత్వం స్కాముల మయంగా మారిందని అన్నారు. 2 జీ కుంభకోణం కొల్ కుంభకోణం పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రలో బీజేపీకి అవకాశం ఇస్తే డబుల్ ఇంజన్ పాలన చేసి చూపిస్తామని అన్నారు.