ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కుల మతాలకు అతీతంగా సమైఖ్యతతో జరుపుకునే పండుగ క్రిస్మస్ అని జగన్ అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు...
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. తద్వారా, మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారన్నారు. దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్ బాటలు వేశారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరిగేలా ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు లభించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.
టీడీపీ అధినేత క్రిస్మస్ శుభాకాంక్షలు....
ప్రేమ, కరుణ, సేవలతో కూడిన శాంతియుత జీవన మార్గాన్ని ప్రపంచానికి అందించిన ఏసుక్రీస్తు జన్మదినాన్ని ఆనందంగా జరుపుకుంటున్న క్రీస్తు ఆరాధకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలని చంద్రబాబు అన్నారు. ప్రేమ అన్నది మానవ లక్షణం అని, సాటి మనిషి పట్ల ప్రేమను, కనికరాన్ని కలిగి ఉండాలని క్రీస్తు మనకు బోధించారని తెలిపారు. లోకానికి నిస్వార్థ సేవామార్గాన్ని సూచించిన శాంతి ప్రదాత క్రీస్తు, తనకు కీడు తలపెట్టిన స్వార్థపరులను సైతం క్షమించగలిగారు, కాబట్టే ఆయనన్ను దైవకుమారుడిగా భావించి ప్రార్థిస్తున్నామని చెప్పారు. సమాజం కోసం జీవితాన్ని, చివరికి ప్రాణాలు సైతం అర్పించిన త్యాగమూర్తి క్రీస్తు మార్గం సర్వజనులకు ఆచరణీయమన్నారు. ఆయన చూపిన మార్గంలో పేదల పట్ల కరుణ కలిగి ఉందామని పిలుపునిచ్చారు. కరుణామయుడైన ఏసు దీవెనలు ఇంటిల్లిపాదికీ లభించాలని ఈ క్రిస్మస్ అందరికీ సంతోషాన్ని ప్రశాంతతను పంచాలని కోరుకుంటున్నానని చంద్రబాబు అన్నారు.
ప్రజలకు, క్రైస్తవ సోదరసోదరీమణులు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. క్రీస్తు పుట్టినరోజు పండగని ఆనందాలు నిండుగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రీస్తు కృపతో శాంతి,సహనం, ప్రేమ సమాజానికి పంచడమే అసలైన క్రిస్మస్ సంబరమన్నారు. మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.అంటూ నారా లోకేష్ ట్విట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందడి...
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ప్రభువైన ఏసు క్రీస్తును భక్తిశ్రద్ధలతో ఆరాధించేందుకు క్రైస్తవులు సంసిద్ధమవుతున్నారు. క్రిస్మస్ పండుగలో ప్రధాన పాత్ర పోషించే స్టార్లు, క్రిస్మస్ ట్రీల అమ్మకాలు జోరుగా సాగాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన క్రిస్మస్ వేడుకలు ఈ ఏడాది ఘనంగా నిర్వహించుకుంటున్నారు.
సర్వ మానవాళిని పాప విముక్తుల్నిగావించేందుకు దైవ కుమారుడైన ఏసుక్రీస్తు భూమిపై అవతరించిన డిసెంబర్ 25ను క్రిస్మస్ పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సందడి నెలకొంది. ఇప్పటికే చర్చ్ లను విద్యుత్ దీపమాలికలతో అందంగా ముస్తాబు చేశారు. కేకులు, స్వీట్లు అమ్మకాలు ఊపందుకున్నాయి. క్రిస్మస్ పండుగలు ప్రధాన పాత్ర వహించే స్టార్లు ట్రీలు కొనుగోలు చేసేందుకు క్రైస్తవులు ఆసక్తి చూపారు. క్రీస్తు జననానికి సంకేతంగా ఆనాడు అంబరంలో కనిపించిన నక్షత్రానికి గుర్తుగా ప్రతి క్రైస్తవుడు ఇంటిపై స్టార్లు ఏర్పాటు చేస్తుంటారు. ఇందుకోసం మార్కెట్లో విభిన్న రంగుల్లో అందమైన స్టార్లు సిద్ధం చేశారు. అలాగే క్రిస్మస్ పండుగ ముందుగా క్రిస్మస్ తాత ఇంటింటికి పెళ్లి చిన్నారులకు బహుమతులు పంచారని ప్రతీతి. దానికి సంకేతంగా ప్రతి ఇంటా క్రిస్మస్ స్త్రీలను ఏర్పాటు చేసి అందంగా అలంకరిస్తారు. మార్కెట్లో క్రిస్మస్ ట్రీల అమ్మకాలు జోరుగా సాగాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా క్రిస్మస్ రోజు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకున్నామని ఈ ఏడాది సామూహిక ప్రార్ధనలకు అవకాశం కలిగిందని క్రైస్తవులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.