విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి డిమాండ్ చేసింది.  ప్రైవేటీకరణను ఉసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మే 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రాస్తారోకోకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునకు సమితి సంపూర్ణ మద్దతు తెలిపింది.
రైతు సంఘాల సమన్వయ సమితి ఆందోళన..
 ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్, మాజీ  వ్యవసాయ శాఖ మంత్రివర్యులు వడ్డే శోభనాద్రిశ్వరరావు అధ్యక్షతన భాగస్వామ్య రైతు సంఘాల, ప్రజా సంఘాలతో విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వడ్డే శోభనాద్రిశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలు 32 మంది బలిదానంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించడం చాలా దారుణం అని, ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక వర్గం నేటికీ 803 రోజులుగా పోరాటం  సాగిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పాల్గొని 13 జిల్లాల్లో మే మూడవ తేదీన రాస్తారోకో జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఉక్కు కోసం పోరాటం...
 విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్ సి.హెచ్ నరసింగరావు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ 2022  వరకు ప్రతి సంవత్సరం రూ.950 కోట్లు లాభాన్ని అర్జించిందని ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి రూ.50వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.15000 కోట్లు పన్నుల రూపంలో చెల్లించిందన్నారు. ఇంకా నిర్మాణం కాని కడప స్టీల్ ప్లాంట్ కు రాష్ట్ర ప్రభుత్వం సొంత గనులు కావాలని అడుగుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మణిహారంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత పనులు కేటాయించాలని ప్రైవేటీకరణ ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.


సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం 26 వేల ఎకరాల భూమిని 16,500 మంది రైతులు ఇచ్చారని, అందులో నిర్వాసితులకు ఇంకా 8600 మందికి ఉద్యోగాలు ఇవ్వలేదని, ఈ ప్లాంట్ కు సంబందించి మూడు లక్షల కోట్ల ఆస్తిని కేవలం 30 వేల కోట్లకు బుక్ వ్యాల్యూకు ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేయుటకు చూడటం చాలా దారుణమన్నారు. కరోనా సమయంలో స్టీల్ ప్లాంట్లు కార్మికులు 150 మంది చనిపోయినా ఎంతో ఆత్మస్దైర్యంతో, దీక్షతో కార్మికులు పని చేసి ప్లాంట్ నుంచి వేల టన్నుల మెడికల్ ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రజలను కాపాడారని చెప్పారు. అంతే కాదు రైతులకు అవసరమైన పుష్కల్, అమోనియం సల్ఫేట్ మందులకు అవసరమైన నైట్రోజన్, బెంజాల్, నెఫ్టాలియన్ నేటికీ ఉత్పత్తి చేస్తూనే ఉన్నారని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి దానిని కొనసాగించడానికి అవసరమైన ఐదువేల కోట్లు రూపాయలు వెంటనే అప్పుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆందోళన చేపడతాం... ప్రజలు సహకరిచాలి..
 సి.ఐ.టి.యు కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.5200 కోట్లు రూపాయలు మాత్రమే అన్నారు. గత 35 సంవత్సరాలుగా సొంత ఘనులు ఇవ్వమని కార్మికులు కోరుతూనే ఉన్నారని, అది పట్టించుకోక పోగా స్టీల్ ప్లాంట్ ను 100% ఉత్పత్తి చేయడానికిగాను అవసరమైన ముడి సరుకు సరఫరా చేయడానికి ఆసక్తి కలవారిని టెండర్లు వేయమని కోరడం దారుణం అన్నారు. మే 3వ తేదీన జరిగే ఆందోళనకు ప్రజలు సహకరించాలని, స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవటం తమ ప్రధాన ఉద్దేశమని అన్నారు.
 ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు వై. కేశవరావు, జాగృతి రైతు సంఘం అధ్యక్షులు మరీదు ప్రసాదు బాబు, ఏ.ఐ.కే.ఎఫ్ అధ్యక్షులు మర్రెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి కుర్రా నరేంద్ర, చెరుకు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండపునేని ఉమా వరప్రసాద్, వివిధ రైతు సంఘాల నాయకులు పటాపంచల జమలయ్య, ఎం.హరిబాబు, బి. ఆజాద్, జొన్న శివశంకర్, గుంటక రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మే మూడో తారీకు రాస్తారోకో జయప్రదం చేయడానికి రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలను,లారీ అసోసియేషన్, ప్రజా సంఘాలను కలిసి వారి మద్దతు కోరాలని నిర్ణయించారు.