Nampally Exhibition Grounds Fish Prasadam In Hyderabad: చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అనుమతి
ఆస్తమా బాధితులకు శుభవార్త. జూన్ 10 నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మూడేళ్ల తరువాత బత్తిని సోదరులు చేప ప్రసాదం చేయనున్నారు. ఆస్తమా బాధితులకు ప్రతి ఏడాది హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో  చేప ప్రసాదం పంపిణీ చేయడం తెలిసిందే. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పంపిణీకి అనుమతి లభించింది. జూన్ 11న ఉదయం 8 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని తెలిపారు.


మృగశిర కార్తెలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిటకిట 
ప్రతి ఏడాది మృగశిర కార్తె (Mrigasira Karti) వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆస్తమా బాధితులతో కిటకిటలాడుతుంది. ఆస్తమా సమస్య ఉన్న వారికి బత్తిని వంశస్తులు చేప ప్రసాదం మందును పంపిణీ చేస్తారు. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాలు, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఆస్తమా పేషెంట్లు చేప మందు తీసుకునేందకు ప్రతి ఏడాది హైదరాబాద్‌కు వచ్చేవారు. కానీ కరోనా నిబంధనల కారణంగా 2020 నుంచి 2022 వరకు వరుసగా మూడేళ్లపాటు చేప ప్రసాదం పంపిణీ జరగలేదు. కరోనా వ్యాప్తి తరువాత, అప్పటి పరిస్థితుల్లో గత ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. తాజాగా చేప ప్రసాదం పంపిణీకి బత్తిని వంశస్తులకు అనుమతి లభించింది. దీంతో ఆస్తమా పేషెంట్లు చేప ప్రసాదం కోసం జూన్ 10, 11 తేదీల్లో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు రావాలని నిర్వాహకుడు బత్తిని గౌరీ శంకర్ (Gowri Shankar Distributes Fish Prasadam) తెలిపారు. 


కరోనాతో మూడేళ్లుగా బంద్.. 
దాదాపు 170 ఏళ్ల నుంచి బత్తిని వంశస్తులు ఆస్తమా పేషెంట్ల కోసం నగరంలో చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తితో మూడేళ్ల కిందట 2020లో తొలిసారి చేప ప్రసాదం పంపిణీకి బ్రేక్ పడింది. కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా, కొవిడ్19 నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేప ప్రసాదం పంపిణీకి అనుమతి ఇవ్వలేదు. గత ఏడాది సైతం ప్రభుత్వం నో చెప్పడంతో ఆస్తమా పేషెంట్లకు నిరాశే ఎదురైంది. కనీసం ఈ ఏడాదైనా తమకు చేప మందు దొరుకుతుందని ఆస్తమా పేషెంట్లు భావించారు. ఈ ఏడాది మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చి చేప మందు తీసుకుందామనుకున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని తెలియడంతో ఆస్తమా బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
ఈ ఏడాది చేప ప్రసాదం నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది, అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు బత్తిని మృగశిర ట్రస్టు సభ్యులు మంగళవారం తెలిపారు. చేప ప్రసాదం పంపిణీ కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అధికారులతో పాటు మున్సిపల్, నీటి, రవాణా, విద్యుత్, మత్స్యశాఖ, ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వ పోలీసు శాఖతో సహా సంబంధిత శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు బత్తిని ట్రస్టు సభ్యులు వివరించారు. అన్ని కుదిరితే మూడేళ్ల తరువాత ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం లభిస్తుంది.