Tekkali News: టెక్కలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి మార్పుతప్పదన్న మాట పార్టీ వర్గాల నుంచి వినిపిస్తొంది. ప్రస్తుత టెక్కలి ఇన్ చార్జిగా ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కడం, ఫుల్ స్టాప్ లేకుండా ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు వెలుగుచూస్తుండడంతో వైకాపాకి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వివాదాలు యావత్ రాష్ట్రాన్ని షేక్ చేస్తుండడం,
ఆతని తీరుపై అనేక విమర్శలు వ్యక్తమవుతుండడంతో వైసీపి అధిషానం ఆచితూచి ఇప్పటి వరకూ వ్యవహరిస్తూ వస్తుంది. ఈ వివాదాలురోజుకో మలుపు తిరుగుతుండడంతో ఇన్ చార్జిగా దువ్వాడ శ్రీనివాస్ ను తప్పించే ఆలోచనకి పార్టీ పెద్దలు వచ్చినట్లుగా తాడేపల్లి వర్గాలద్వారా తెలుస్తోంది.
దువ్వాడను తప్పించే యోచన
ఆయనను తప్పించి కొత్తవారిని నియమించే యోచనలో అధిష్టాన వర్గాలు ఉన్నట్లుగా సమాచారం. మొదట నుంచి టెక్కలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో మూడు ముక్కలాట కొనసాగుతూనే ఉంది. దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్, డా. కిల్లి కృపారాణిల మద్య తొలుతగ్రూపులు నెలకొన్నాయి. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రంఎప్పుడూ కూడా దువ్వాడ శ్రీనివాస్ కే మద్దతుగా నిలుస్తూ వచ్చారు. 2019లో దువ్వాడ శ్రీనివాస్ కి శ్రీకాకుళం ఎంపిగా పోటీ చేసే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ఇవ్వగా ఆయన ఓటమి చవిచూసారు. పార్టీ అధికారంలో ఉన్న నేపధ్యంలో శ్రీనివాస్ ను ఇన్ చార్జిగా ప్రకటించి పెత్తనాన్ని మొత్తం ఆయనకే అప్పగించారు. అటు తర్వాత ఎమ్మెల్సీగా కూడా జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ కి అవకాశం కల్పించారు.
సీన్‌లోకి దువ్వాడ వాణి
అటు తర్వాత కొన్నాళ్ళు పేరాడ తిలక్ కి టెక్కలి ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ 2024 ఎన్నికలకి గాను టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ ను అందరి కంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డి ప్రకటించి ఇన్ చార్జి చేసారు. అయితే దువ్వాడ కుటుంబంలోని భార్య భర్తల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా శ్రీనివాస్ ను ఇన్ చార్జిగా తప్పించి ఆయన సతీమణి వాణిని టెక్కలి ఇన్ చార్జిగా ఎన్నికలముందే ప్రకటించారు. ఆ సమయంలో టెక్కలి ఇన్ చార్జిగా ఉన్నదువ్వాడ వాణి, ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ల వర్గాలుగా అక్కడి నాయకులు, కార్యకర్త లు గ్రూపులు కట్టారు. అదే నియోజకవర్గానికి చెందిన పేరాట తిలక్ కంటూ ప్రత్యేకంగా గ్రూపు అప్పటికీ వేరేగా ఉండనే ఉంది. దువ్వాడ శ్రీనివాస్,వాణిల మద్య నెలకొన్న విభేదాల వల్ల భర్తను తప్పించి భార్యకు ఇన్ చార్జి పదవికట్టబెట్టినా వారి మధ్య సయోధ్య మాత్రం కుదరలేదు.
మళ్లీ దువ్వాడ
దీంతో ఎన్నికల ముందు వాణిని ఇన్ చార్జిగా మరోసారి తప్పించి దువ్వాడ శ్రీనివాస్ కే ఇన్ చార్జిని జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. 2024ఎన్నికలలో టెక్కలి నుంచి దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా పోటీచేయగా, పేరాడ తిలక్ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించారు. ఎన్ డిఏ కూటమి వేవ్ లో వారిద్దరూ కూడా అందరి నాయకులతో పాటే ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం టెక్కలి ఇన్ చార్జిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొనసాగుతున్నారు. అయితే ఇటీవల మరోసారి దువ్వాడ శ్రీనివాస్.వాణి దంపతుల మద్య నెలకొన్న వివాదం రచ్చకెక్కింది. దువ్వాడశ్రీనివాస్ ఇంటి ఎదుట వాణి ఆందోళనకి దిగడం, దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురిలు ఆమె ఆరోపణలు ఖండించడం వెరసి కుటుంబవివాదం రచ్చకెక్కింది.
ఈ వివాదం పార్టీకి నష్టం చేకూర్చే పరిస్థితి ఉందంటూ అధిష్టానం ఇప్పుడు టెక్కలిపై దృష్టి పెట్టినట్లుగాతెలిసింది. ఇన్ చార్జిగా దువ్వాడ శ్రీనివాస్ ను తప్పించి కొత్త వారికిఅవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలను పార్టీ పెద్దలు చేస్తున్నట్లుగా సమాచారం. స్థానికంగా ఉన్న నేతలకి కాకుండాఇతరులకి ఇన్ చార్జి పదవిని కట్టబెట్టే ప్లాన్ చేస్తున్నట్లుగా రాజకీయవర్గాలలో చర్చ జరుగుతుంది. ప్రజల మద్యకి దువ్వాడ శ్రీనివాస్ వెళ్తే ఈ వివాదాల వ్యవహారం పార్టీ మీద ప్రభావం చూపిస్తుందన్న మాటకొందరు సీనియర్ల నుంచి వినిపిస్తొంది. పార్టీ పెద్దలు ఏదోకనిర్ణయం తీసుకుంటే మేలని వారి అభిప్రాయాలను తెలియజేసినట్లుగా సమాచారం. త్వరలోనే టెక్కలిపై కేంద్ర కార్యాలయం ఓప్రకటనను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి ఎటువంటి ప్రకటన
విడుదలవుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.