Srikakulam Latest News: పలాసలో వెలుగు చూసిన సుపారీ కేసు శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. క్వారీలో జరిగి చిన్న గడవతో అసలు కుట్ర వెలుగు చూసింది. దీంతో వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. కొద్ది గంటలకే మాజీ మంత్రి, పలాస వైకాపా ఇన్‌ఛార్జి డాక్టర్ సీదిరి అప్పలరాజు పోలీస్ స్టేషన్‌లో ధర్నా చేశారు.
కిడ్నాప్ చేశారని అప్పల రాజు ఆరోపణలు
ఆదివారం రాత్రి జిల్లా మొత్తాన్ని వైసీపీ నేతల అరెస్టు కుదిపేసింది. తమ అనుచరులను అక్రమంగా అరెస్టు చేస్తారా అంటూ మాజీ మంత్రి పలాసా ఇన్‌ఛార్జ్ సీదిరి అప్పలరాజు హంగామా చేశారు. ఆదివారం రాత్రంతా స్టేషన్‌లోనే ఉన్నారు. తమ వాళ్లను అరెస్టు చేయకుండా కిడ్నాప్ చేశారంటూ ఆరోపించారు.
టీడీపీ హత్యకు కుట్ర చేశారని అరెస్టు
అసలు వారిని ఎందుకు అరెస్టు చేశారు. వాళ్లెవరు... ఏం జరిగిందనే విషయాలను లోతుగా ఆరా తీస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ టిడీపీ నేతను హత్య చేసేందుకు బిహార్ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చారని వాళ్లు ఇచ్చిన సమాచారంతో వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నట్టు తేలింది.
క్వారీలో వెలుగు చూసిన కుట్ర
ఆదివారం రాత్రి పలాస నియోజకవర్గాన్ని, ఉదయం జిల్లా మొత్తాన్ని కుదిపేసిన సుపారీ కేసు వెలుగు చూసింది ఓ క్వారీలో. టెక్కలిలో ఒక క్వారీ వద్ద బీహార్‌కు చెందిన ముగ్గురు వ్యక్తుల మధ్య చిన్న వివాదం చెలరేగింది. క్వారీలో ఈ గొడవ పోలీసులకు చేరింది. అక్కడకు వచ్చిన టెక్కలి పోలీసులు గొడవపడిన వారిని విచారించారు. ఈ టైంలోనే ఒక నాటు తుపాకీ, మారణాయుధాలు బయటపడ్డాయి.
Also Read: 1953 నుంచి లేటెస్ట్ టూవీలర్ వరకు కలెక్ట్ చేసిన విశాఖ వ్యక్తి- ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 బైక్‌లు సేకరణ
హత్య కోసం పది లక్షల సుపారీ
ఒక్కసారిగా అలర్ట్ అయిన పోలీసులు వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి తమ స్టైల్‌లో విచారించారు. అంతే అసలు గుట్టు విప్పారు. సుపారీ తీసుకొని హత్య చేయడానికి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పలాస టీడీపీ పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజును హత్యకు ఈ ముఠా రూ.10 లక్షలు సుపారీ తీసుకుంది. ఈ గ్యాంగ్ ఇచ్చిన సమాచారంతో వైసీపీ మద్దతుదారులైన చిన్నబడాం గ్రామానికి చెందిన అంపోలు శ్రీనివాసరావు, కూర్మాపు ధర్మారావును అరెస్టు చేశారు.
ఎవరీ నాగరాజు? ఎందుకింత కక్ష?
టీడీపీ పలాస పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. గత పాలకులు ఆయన్ని టార్గెట్ చేసుకున్నారు. ఆయన ఇంటికి వేసుకున్న రోడ్డును తవ్వి దారి లేకుండా చేశారు. ఐదేళ్లు కేసులు, కోర్టులు, పోలీస్‌స్టేషన్‌లు చుట్టూ తిరిగిన నాగరాజు టీడీపీ గెలిచిన తర్వాత రెచ్చిపోయారు. టీడీపీ గెలిచిన రోజే వైసీపీ లీడర్ దిక్కల నిరంజన్ ఇంట్లోకి చొరబడి చితకబాదారు. వరి పొలంలో ధర్మారావుపై దాడి చేశారు. నర్సిపురంలో వైసీపీ నాయకులు వేసిన లేఅవుట్‌లో అక్రమాలు జరిగాయని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల వైసీపీ నాయకులను స్టేషన్‌కు తీసుకెళ్లడంలో నాగరాజు ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. స్థానిక కౌన్సిలర్ కుటుంబంతో కూడా విభేదాలు ఉన్నాయి. వీళ్లకు సమీప బంధువే పలాస జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్న శ్రీనివాసరావు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాగరాజు నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో స్పాట్ పెట్టారని తెలుస్తోంది. ఆ పని బిహార్ గ్యాంగ్‌కు అప్పగించినట్టు పలాసలో ప్రచారం ఉంది. దీనిపై పోలీసులు నోరిప్పిన తర్వాతనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అందుకే వీళ్లిద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాదంలో మరికొంత మంది పాత్రపై పోలీసులు దర్మాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ నేతలను ప్రస్తుతం నరసన్నపేట స్టేషన్‌కు తరలించగా, బిహార్ ముఠాను టెక్కలి పోలీస్ స్టేషన్‌లో ఉంచి విచారణ చేస్తున్నట్టు తెలిసింది.
Also Read: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?