YSRCP Bus Yathra: జయహో జగనన్న నినాదంతో సిక్కోలు నుంచి ప్రారంభించనున్న వైసీపీ బస్సుయాత్రకు ఆ పార్టీ కేడర్ సిద్ధమైంది. 'సామాజిక న్యాయభేరి' పేరిట చేపట్టనున్న యాత్ర నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు బుధవారం సాయంత్రానికి జిల్లాకు చేరుకున్నారు. అభివృద్ధి.. సంక్షేమం.. సామాజిక విప్లవం మూడేళ్ల సాధించిన విజయాలపై ప్రధానంగా ఈ బస్సుల యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులు పాటు పర్యటనపై ఇప్పటికే షెడ్యూలు ప్రకటించారు. కోనసీమలో చెలరేగిన వివాదాలు నేపథ్యంలో వాయిదా పడుతుందని పుకార్లు వచ్చినప్పటికి తొలి ప్రకటించిన షెడ్యూలు మేరకు యాత్ర సాగనుంది.
నిన్నే చేరుకున్న మంత్రులు
సిక్కోలు నుంచే యాత్ర ప్రారంభించనుండటంతో రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ ఈ ఏర్పాట్లపై చర్చించారు. వారితో పాటు మరో మంత్రి అప్పలరాజు నియోజకవర్గ ఎమ్మెల్యేలు, విజయనగరం ఎంపీ ఈ యాత్రను విజయవంతం చేయాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్న ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణపై సమాధానం చెప్పేందుకే ఈ యాత్రకు సిద్ధమయ్యారు.
ప్రజలకు వివరించేలా
ప్రధానంగా రాజ్యసభ విషయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరిని ఎంపిక చేసిన తరువాత ఏర్పడిన పరిణామాలతో ఈ యాత్రకు పార్టీ నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. అంతకు వరకు గడపగడపకు ప్రభుత్వం అనే నినాదాంతో ప్రజలలో పథకాల కోసం వివరిస్తుండగా ఆకస్మికంగా ఈ యాత్రకు సిద్ధమయ్యారు. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ 2019 సాధారణ ఎన్నికలకు ముందు చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఈ మూడేళ్లలో తీర్చగలిగామని ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి వివరిస్తున్నారు. అక్కడక్కడ ప్రతి ఘటనలు ఎదురైన వాటిని సర్దుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
పథకాలపై ప్రచారం
బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పదవుల కేటాయింపులో సామాజిక విప్లవాన్ని సృష్టించిన తీరును ప్రజల్లోకి వెళ్లి వివరించడం ద్వారా వారిలో ఉండే అపోహాలను తొలగించవచ్చని అధిష్టానం భావిస్తోంది. ఈనేపథ్యంలో బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలకు చెందిన 17 మంది మంత్రులు ఈ బస్సు యాత్రలో భాగస్వామ్యం అవుతున్నారు. ప్రతిపక్షాల జోరుకు బ్రేకులు వేయాలంటే మంత్రులు నాలుగు రోజులపాటు యాత్ర చేసి, ప్రభుత్వ పథకాలపై మరింత ఎక్కువగా ప్రచారం చేసి, తమ పాలనపై ప్రజలలో మరింత అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఈ బస్ టూర్‌కు శ్రీకారం చుట్టారు.