YSRCP News: వైఎస్ఆర్ సీపీ నేత దువ్వాడ శ్రీనివాస్‌పై వేటు పడింది. టెక్కలి నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇంఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనును  ఆ పదవి నుంచి పార్టీ అధినేత వైఎస్ జగన్ తొలగించారు. దువ్వాడ శ్రీను స్థానంలో టెక్కలి ఇంఛార్జిగా పేరాడ తిలక్‌ను జగన్ నియమించారు. గతంలోనూ పేరాడ తిలక్ టెక్కలి వైసీపీ ఇంఛార్జి బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. 


దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితం రోడ్డెక్కడం.. ఆయన భార్య, పిల్లల నుంచే ఆరోపణలు ఎదుర్కోవడంతో దువ్వాడ కారణంగా పార్టీకి డ్యామేజ్ జరిగినట్లుగా భావిస్తున్నారు. దువ్వాడ శ్రీను భార్యా పిల్లలతో సొంతింట్లో ఉండకుండా.. పరాయి మహిళతో మరో ఇంట్లో ఉండడం అనేక విమర్శలకు దారి తీసింది. ఈ వ్యవహారంలో వైసీపీ అధిష్ఠానం చాలా రోజులు ఆచితూచి చూసి.. ఇప్పుడు కఠిన చర్య తీసుకుంది. దువ్వాడకు ఆ పదవి పోతుందని ముందే అందరూ ఊహించారు. పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అనుకున్నట్లుగానే వైఎస్ జగన్ దువ్వాడ శ్రీనును టెక్కలి ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు.


గత ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి


2024 ఎన్నికలలో టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ పోటీ చేశారు. కానీ, ఎన్డీఏ కూటమి ప్రభంజనంలో వీరు ఇద్దరూ గెలవలేకపోయారు. అలా ప్రస్తుతం టెక్కలి ఇంఛార్జిగా ఎమ్మెల్సీ అయిన దువ్వాడ శ్రీనివాస్ కొనసాగుతున్నారు.


ఇంతలో ఆగస్టు 9 నుంచి దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలోని అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ రోజు రాత్రి దువ్వాడ శ్రీనివాస్ భార్య, ఇద్దరు పిల్లలు తన తండ్రిపై ఆరోపణలు చేస్తూ ఓ ఇంటి ముందు నిరసనకు దిగారు. టెక్కలి అక్కవరంలోని ఆ ఇంట్లోనే దువ్వాడ శ్రీను మరో వైఎస్ఆర్ సీపీ మహిళా నాయకురాలు దివ్వల మాధురి అనే ఆవిడతో కలిసి ఉంటున్నారు. ఇలా దువ్వాడ శ్రీనివాస్ - వాణి దంపతుల మధ్య నెలకొన్న వివాదం రోడ్డెక్కింది. దువ్వాడ శ్రీనివాస్.. మాధురితో కలిసి ఉంటున్న ఇంటి ఎదుట వాణి రోజుల తరబడి ఆందోళనకి దిగడం.. తన భర్తపై వాణి తీవ్రమైన ఆరోపణలు చేయడం చేసేవారు. దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి ఆ ఆరోపణలను ఖండిస్తూ.. ఒకరికొకరు మద్దతుగా నిలుచుకోవడం లాంటి ఘటనలతో పార్టీ ప్రతిష్ఠ కూడా దెబ్బతిన్నది. 


ఎప్పటి నుంచో ఊహాగానాలు
ఈ వివాదం టెక్కలికే పరిమితం అయినప్పటికీ పార్టీకి నష్టం జరగడం మాత్రం రాష్ట్రమంతా ఉంటోంది. దీంతో అధిష్ఠానం ఇప్పుడు టెక్కలిపై దృష్టి పెట్టింది. ఇంఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్ ను తప్పించి పేరాడ తిలక్ కు అవకాశం ఇచ్చింది. దువ్వాడ వివాదం ఆయన వ్యక్తిగతం అని లైట్ తీసుకోవడానికి లేదు. భవిష్యత్తులో దువ్వాడ ప్రజల మధ్యకి వెళ్తే.. ప్రజలు ఆదరించే అవకాశం లేదు. ఈ వివాదాల వ్యవహారం పార్టీ మీద ప్రభావం చూపిస్తుందని అధిష్ఠానం కూడా అభిప్రాయపడింది. అందులో భాగంగానే అందరి ఊహాగానాలకు తగ్గట్లుగానే దువ్వాడ శ్రీనివాస్ ను టెక్కలి ఇంఛార్జిగా తప్పించి.. పేరాడ తిలక్ ను నియమించింది.