Achyuthapuram SEZ: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో సాహితీ ఫార్మా కంపెనీలో శుక్రవారం జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు చొప్పున ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. సీఎం జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని మంత్రి గుడివాడ తెలియజేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న వారిని సాయంత్రం అమర్నాథ్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. 


మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. సాహితీ ఫార్మా కంపెనీలో 35 మంది పనిచేస్తున్న సమయంలో కంటైనర్ లో సాల్వెంట్ లోడ్ చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగిందన్నారు.  మంటలు చెలరేగడంతో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా వీరిలో నలుగురిని కిమ్స్ ఆస్పత్రికి, ఇద్దరిని కేజీహెచ్ కు, ఒకరిని అచ్చుతాపురం ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పారు. ప్రమాదం జరిగిన తీరుకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 


ఈ ప్రమాదంలో జంగాలపాలెం చెందిన పైలా సత్తిబాబుకు 95 శాతం గాయాలై అతడు మరణించాడని, విజయనగరం జిల్లాకు చెందిన ఉప్పాడ తిరుపతికి ఈ ప్రమాదంలో ఊపిరితిత్తులు దెబ్బతిని చనిపోయాడని మంత్రి అమర్నాథ్ తెలిపారు. భువనేశ్వర్ కు చెందిన రామేశ్వర్, అనకాపల్లి జిల్లా రేబాకకు చెందిన సాగిరెడ్డి రాజాబాబు, నక్కపల్లికి చెందిన ఎస్. అప్పారావు, పంచదారలకు చెందిన సింగంశెట్టి నూకనాయుడు 96 గాయాలతో కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. జరిగిన ప్రమాదం గురించి ముఖ్యమంత్రికి వివరించగా మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. క్షతగాత్రులకు ఇంకా మెరుగైన వైద్యం కావాల్సి వస్తే ఎక్కడికైనా తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని కూడా ఆయన తెలియజేశారు.


జరిగిన ఘటనపై అధికారులతో సమీక్షిస్తున్నామని ఇది ఎవరి నిర్లక్ష్యమని తెలినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రమాదకర పరిశ్రమలపై ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తోందని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని అమర్నాథ్ అన్నారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా మరిన్ని కఠిన ర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు.


ప్రమాదాలు జరగకుండ జాగ్రత్తలు తీసుకోవాలి
అచ్యుతాపురం సెజ్ లో జరుగుతున్న వరుస ప్రమాదాలపై ఎప్పటి కప్పుడు కంపెనీల యజమానులకు జాగ్రత్త లు తీసుకోవాలని చెబుతున్నా.. ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి అమర్ నాథ్ అన్నారు. మరోసారి అక్కడి అచ్యుతా పురం సెజ్ లోని కంపెనీలతో మాట్లాడి మరింత కఠిన మైన నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం అని ఆయన అన్నారు. కేజీహెచ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మిగిలిన బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న ట్లు తెలిపిన ఆయన వారిలో ఒకరి పరిస్థితి మాత్రం ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పారు. ఆ తరువాత కేజీహెచ్ నుండి సంఘటనా స్థలానికి వెళ్ళారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial