YSRCP Latest News: ఏ రాష్ట్రంలోనైనా సరే ప్రతిపక్షాలు బలపడేది ప్రజా ఉద్యమాల ద్వారానే. ఇది చాలాసార్లు రుజువైన విషయం. ఏపీలో 2024 తర్వాత విపక్షాలకు కలిసివచ్చిన అలాంటి అంశాలు చాలా తక్కువ. చేసిన కొద్దిపాటి ఉద్యమాలు నిరసనలు రాష్ట్రం మొత్తాన్ని కదిలించే అంశాలు కావు. కొన్ని ముఖ్యమైన అంశాలు అలాంటివి దొరికినా వాటిని విపక్షాలు సరిగ్గా వాడుకోలేదనే చెప్పాలి. అలాంటి వాటిలో రాయలసీమ మామిడి రైతుల ఆందోళన, నెల్లూరు జిల్లా కర్రేడులో భూములు కోల్పోతున్న గ్రామస్తుల నిరసన, పెరిగిపోయిన విద్యుత్ బిల్లుల అంశాల వంటివి ముఖ్యం. ఇలాంటి ముఖ్యమైన అంశాలపై ఇంతవరకు విపక్షాలు కలిసికట్టుగా ముందుకు దిగిన ఉద్యమాలు లేనే లేవు. పోనీ ప్రధాన విపక్షాలుగా భావించే పార్టీలు ఒంటరిగానన్నా ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో ఉద్యమానికి దిగాయా అంటే అదీ లేదు. అలాంటి తరుణంలో ప్రధాన విపక్షం వైసీపీకి ఒక ముఖ్యమైన ఆయుధంలా మారే ఛాన్స్ " విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ " అంశం ద్వారా వస్తోంది.
రోజురోజుకీ ప్రైవేటీకరణ దిశగా సాగుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్
'ఆంధ్రుల హక్కు -విశాఖ ఉక్కు' నినాదంతో ఎంతోమంది బలిదానాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ప్రైవేటుపరం కాబోతున్న సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఒకపక్క స్టీల్ ప్లాంట్‌ని ఆదుకుంటామని చెబుతున్న కేంద్రం మరోవైపు "పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి" గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులలతోపాటు సగటు తెలుగువాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అయిపోతుందన్న నమ్మకానికి దగ్గరవుతున్నారు. ప్రతి నెల వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో పాటు తాజాగా 32విభాగాలను ప్రైవేట్‌పరం చేశారంటూ వస్తున్న వార్తలు ఏళ్ల తరబడి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగుల నమ్మకంపై దెబ్బకొడుతున్నాయి. అయితే ప్రైవేటు పరం కాకుండా స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతామంటూ కూటమి నేతలు చేస్తున్న ప్రకటనలు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాయి అనేది వాస్తవం అని వామపక్ష నేతలు చెప్తున్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటానికి బలం సరిపోవడం లేదు.
వైసీపీ కి ఇది మంచి అవకాశమే.. కానీ
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉద్యమించడానికి విపక్ష వైసిపికి ఇది అద్భుతమైన అవకాశమని ఎనలిస్టులు చెప్తున్నారు. వైసిపి అధికారంలో ఉన్న ఐదేళ్లు వారు చెప్పినట్టుగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం నెమ్మదించింది. ప్రవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోకపోయినప్పటికీ దానిపై ముందుకు కూడా వెళ్లలేదు. కాబట్టి ఐదేళ్లు స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకున్నాం అనే క్లయిమ్ వైసిపి నేతలు చేసుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని ఆధారంగా చేసుకుని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులతో కలిసి ఉద్యమించే అవకాశం వైసీపీకి ఉంది. నిజంగా అలా చేస్తే ప్రజల్లో పార్టీ ఇమేజ్ కూడా పెరుగుతోంది. కానీ రాష్ట్రంలో తన ప్రత్యర్థులతో కలిసి ఉన్న బిజెపికి ఉప రాష్టపతి ఎన్నికల్లో కేంద్రంలో మద్దతిచ్చిన వింత పరిస్థితి వైసిపిది.
చంద్రబాబు, పవన్ పై ఒంటికాలిపై లేచే జగన్మోహన్ రెడ్డి బీజేపీపై అంతే తీవ్రంగా ఈ అంశంపై పోరాడగల ధైర్యం చేస్తారా అనేది రాజకీయవర్గాల్లో చర్చగా మారింది. పోలవరం, అమరావతి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఈ మూడు ప్రస్తుతం ఆంధ్రుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్నవి. అమరావతిపై వైసీపీ ఇప్పటికీ అస్పష్టమైన స్టాండ్ తోటే ఉంది . పోలవరం నిర్మాణాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతో ఐదేళ్లు వెనక తీసుకుపోయిందంటూ టిడిపి పదే పదే ఆరోపణలు చేస్తున్నా దానికి సరైన కౌంటర్ వైసీపీ నుంచి రావడం లేదు. ఇక వారికి మిగిలింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. కూటమి నేతల అస్పష్ట ప్రకటనల మధ్య స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విపక్షాలు ఉద్యమిస్తే కచ్చితంగా ప్రజలు మద్దతు వారికి ఉంటుంది. మరి ఇలాంటి అవకాశాన్ని వైసిపి ఏ మాత్రం వాడుకుంటుందో చూడాలి అంటున్నారు ఎనలిస్ట్ లు.