విశాఖపట్నం: పట్టపగలు నడిరోడ్డుపై ఓ మద్యం డీసీఎం (Liquor Load) బోల్తా పడింది. అది చూసిన వెంటనే అటుగా వెళ్తున్న కొందరు మద్యం సీసాల కోసం ఎగబడ్డారు. దొరికింది దొరికినట్లు కొందరు మద్యం బాటిళ్లను తీసుకెళ్లారు. విశాఖపట్నం (Visakhapatnam ) నగర పరిధిలోని మధురవాడలో శనివారం ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మద్యం లోడ్ తో వెళ్తున్న ఓ డీసీఎం విశాఖ నగర పరిధిలోని మధురవాడలో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. మద్యం లోడ్ డీసీఎం ఆనందపురం నుంచి విశాఖ సిటీ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో మధురవాడ వద్దకు రాగానే అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయడానికి డీసీఎం డ్రైవర్ ప్రయత్నించగా.. వాహనం డివైడర్‌ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. దాంతో డీసీఎంలో ఉన్న మద్యం బాటిల్స్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
ప్రమాదం జరిగిందనగానే అటుగా ప్రజలు వెళ్లడం తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ బోల్తా పడింది మద్యం లోడ్ డీసీఎం కావడంతో అటుగా పలువురు వాహనదారులు, స్థానికులు ఒక్కసారిగా డీసీఎం వైపు పరుగులు పెట్టారు. చేతికి అందినన్ని మద్యం బాటిల్స్ పట్టుకుని వెళ్లిపోయారని తెలిపారు. అక్కడ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి ప్రజలు గుమిగూడకుండా వారిని అదుపుచేశారు. డీసీఎం డ్రైవర్ కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ట్రాఫిక్ పోలీసుల నుంచి సమాచారం అందుకున్న మధురవాడ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. స్థానికుల సహాయంతో మద్యం సీసాలను డీసీఎం నుంచి అన్ లోడ్ చేస్తున్నారు. లారీని సైతం జేసీబీతో రోడ్డు నుంచి పక్కకు జరిపి, ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు.