Jagan Compensation for Vizag Fishing Harbour Victims: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో బోట్లు కాలిపోయిన బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మత్స్యకారులకు భారీ సాయాన్ని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 80 శాతం సాయాన్ని, సీఎం జగన్ ప్రభుత్వం ఈ ప్రమాదంలో నష్టపోయిన వారి కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే మత్యకారులను మంత్రి సీదిరి అప్పలరాజు పరామర్శించిన సంగతి తెలిసిందే. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. 


నిన్న విశాఖ హార్బర్ (Vizag Fishing Harbour) వద్ద అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో దాదాపు నలభై బోట్ల వరకూ అగ్ని ప్రమాదానికి కాలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి (CM Jagan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంపై విచారణ చేసి, అసలు కారణాలు కనుక్కోవాలని ఆదేశించారు.


ఇదీ జరిగింది


విశాఖలో ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం అర్ధరాత్రి (నవంబరు 19) జరిగిన అగ్ని ప్రమాదంలో 60 బోట్లు దగ్ధం కాగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అప్రమత్తం అయినప్పటికీ ఆస్తి నష్టాన్ని తగ్గించలేకపోయారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది 4 ఫైరింజన్లు, ఓ ఫైర్ టగ్ నౌకతో మంటలు అదుపులోకి తెచ్చారు. బోట్లలో ఉండే ఇంధనంతో మంటలు మరింత వ్యాపించాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, కారణాలు అన్వేషించాలని నిర్దేశించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, వారికి తగు సహాయం చేయాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి సీదిరి అప్పలరాజు ప్రమాద స్థలానికి వెళ్లి పరిశీలించారు. మత్స్యకారులు ఆయనకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


మత్స్యకారుల ఆందోళన


విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంతో స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదంలో జీవనాధారమైన తమ బోట్లు దగ్ధం కావడంతో బోరున విలపించారు. ఒక్కో బోటు ఖరీదు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు ఉంటుందని రూ.కోట్లల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రమాదాలు చూడలేదని చెప్పారు. ఈ క్రమంలో ఫిషింగ్ హార్బర్ ప్రధాన గేటు వద్ద నిరసన చేపట్టారు. ప్రమాద స్థలాన్ని సీఎం సందర్శించి తమకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 


ప్రమాదానికి అదే కారణమా.?


కాగా, అగ్ని ప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాత్రి ఫిషింగ్ హార్బర్ లో ఓ యూట్యూబర్ మద్యం పార్టీ ఏర్పాటు చేసి, మద్యం మత్తులో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బోటుకు నిప్పు పెట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం పరారీలో ఉన్న సదరు యూట్యూబర్, అతని స్నేహితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. వారిని పట్టుకుని విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రమాద స్థలంలో సీసీ కెమెరాల ద్వారా మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నిందితులు ఎంతటివారైనా వదిలి పెట్టమని, ఆస్తి నష్టంపై పూర్తి స్థాయి అంచనా వేస్తున్నట్లు జేసీ తెలిపారు.