మనం ఆకాశంలో ఎగిరే డ్రోన్‌లు గురించి విన్నాం. కానీ నీటిలో ఈదుకుంటూ వెళ్లి మునిగిపోయేవారి ప్రాణాలు కాపాడే వాటర్ డ్రోన్ గురించి విన్నారా ? లేకపోతే మీరు వైజాగ్ వెళ్లాల్సిందే. విశాఖ తీరంలో కొందరు యువకులు కలిసి తయారు చేసిన వాటర్ డ్రోన్ ఇప్పుడు సిటీలో హాట్ టాపిక్ అయింది.


సముద్రంలో ఈతకు వెళ్లి పొరపాటున మునిగిపోయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. అలంటి వారిని కాపాడటానికి లైఫ్ గార్డ్స్, ఇతర సిబ్బంది ఉన్నా అలాంటి పరిస్థితుల్లో సమయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో ప్రతీ క్షణమూ ఎంతో ముఖ్యం . అక్కడే ఈ వాటర్ డ్రోన్ తన ప్రతిభను చూపుతుంది.


ఒడ్డున నిలబడి రిమోట్‌తో బటన్ నొక్కితే చాలు వేగంగా నీటిలో ఈదుకుంటూ వెళ్లి మునిగిపోయే వారి దగ్గరకు చేరిపోతుంది. వారు దీనిని పట్టుకుంటే చాలు వెంటనే వారిని ఒడ్డుకు తీసుకు వచ్చేస్తుంది. పైగా ఆటోమేటిక్ రోబోటిక్ ప్రోబ్స్‌తో తయారు చెయ్యడం వల్ల ఇది ఎంత పెద్ద అలలు వచ్చినా నీటిలో మునిగిపోదు. పైగా 150 నుంచి 200 కేజీల బరువును సునాయాసంగా మోసెయ్యగలదు.


నీటిలో ఉండగా కనీసం ఇద్దరు లేదా ముగ్గురుని ఒడ్డుకు తీసుకువచెయ్యగలదని దీని క్రియేటర్స్‌లో ఒకరైన అలీ అస్గర్ అంటున్నారు . ఇప్పటికే పలు ప్రదర్శనల్లో, ఎక్స్పో ల్లో ఈ వాటర్ డ్రోన్ ఎంతో మంది మన్ననలను అందుకుంది. దీనిని భారత ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసే ఆలోచనలో ఉందని, ఇప్పటికే దీని పరీక్షలు కూడా పూర్తయ్యాయని దీని రూపకర్తలు అంటున్నారు. ఇది పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో విశాఖలో తయారైన పరికరం కావడం విశేషం. ఇలాంటి వాటర్ డ్రోన్ తయారు చెయ్యడం కూడా దేశంలో ఇదే మొదటిసారి అని అలీ అస్గర్ అంటున్నారు . 


ప్రాణాలు తీస్తున్న ఈత  మోజు


ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా విశాఖ లాంటి సముద్ర ప్రాంతాల్లో సరదా కోసం ఈతకు సముద్రంలోకి వెళ్లడం అలలతాకిడి తట్టుకోలేక మృతి చెందడం లాంటి ఘటనలు పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే వైజాగ్ బీచ్‌లలో 2014లో 45 మంది, 2015లో 39, 2016లో 41, 2017 లో 36,2018లో 21, 2019లో 18, 2020లో 18, 2021లో 13, ఇక ఈఏడాది ఇప్పటి వరకూ 12 మంది వరకూ మృతి చెందారు. ఇలా మునిగిపోయేవారిని కాపాడడానికి గజ ఈతగాళ్లు , కోస్ట్ గార్డ్ సిబ్బంది ఇలా వేరు వేరు విభాగాలకు చెందిన వారు తమతమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే మనిషి ఈదుకుంటూ వెళ్లి మునిగిపోతున్న మరో వ్యక్తిని  కాపాడే సమయం కంటే చాలా వేగంగా ఈ వాటర్ డ్రోన్ కాపాడుతుంది అనేది దీనిని తయారుచేసిన శ్రీనివాస్  అంటున్నారు . 


ఇవీ వాటర్ డ్రోన్ విశేషాలు


1) ఈ వాటర్ డ్రోన్ పూర్తిగా రిమోట్ ఆధారంగా పనిచేస్తుంది . 
2) నీటిలో 30 మీటర్ల దూరాన్ని 5 నుంచి 6 సెకనుల్లో  చేరుకుంటుంది 
3) లైఫ్ గార్డ్ ఒకసారికి ఒకరిని మాత్రమే కాపాడగలదు. కానీ ఈ వాటర్ డ్రోన్  200 కేజీల బరువు వరకూ అంటే  కనీసం ముగ్గురిని ఒకేసారి కాపాడగలదు 
4) గంటకు 15 కిలోమీటర్ల వేగంతో అలలను ఉద్ధృతిని దాటుకుని మరీ దూసుకెళ్లగలదు 
5) 22 కేజీల బరువుండే ఈ డ్రోన్‌ను ఈజీగా వేరే చోటుకు తీసుకెళ్లవచ్చు 
6) బ్యాటరీ ఒకసారి రీఛార్జ్ చేస్తే గంట పాటు ఏకధాటిగా పనిచేస్తుంది. దానితోపాటే 5నుంచి 6 గంటల వరకూ స్టాండ్ బై మోడ్‌లో ఉంచొచ్చు . బ్యాటరీని కూడా  అరగంటలోనే 80 శాతం రీచార్జ్ చేసేయ్యొచ్చు 
7) ఒడ్డున నిలబడి రెండు కిలోమీటర్ల దూరం వరకూ ఈ డ్రోన్ పంపొచ్చు . 
8) ఒక్క సముద్రంలోనే కాకుండా నదుల్లో వచ్చే వరద సమయాల్లో కూడా మనుషుల ప్రాణాలను కాపాడడానికి ఈ డ్రోన్ ఉపయోగపడుతుంది అంటున్నారు దీనిని తయారుచేసిన వారు .


ప్రధాని మోదీ  ప్రశంసలు


ఈ వాటర్ డ్రోన్‌ను ఇప్పటికే దిల్లీ జరిగిన డిఫెన్స్ ఎక్స్పో లో ప్రదర్శించగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రశంసలు లభించాయి. ఇక భారత ప్రధాని మోదీ అయితే దీని పనితీరును గురించి అడిగి తెలుసుకుని తయారు చేసిన అస్గర్ టీమ్ ను ప్రశంసించారని వారు తెలిపారు. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నుంచి వాటర్ డ్రోన్‌ల కోసం ఆర్డర్ లు రాగా, ఏపీ పర్యాటక శాఖ కూడా ఇటీవల ట్రయిల్ రన్ నిర్వహించింది. వాటర్ డ్రోన్ గా పిలువబడుతున్న సైఫసీస్ డ్రోన్ ను టూరిస్ట్ ప్లేసుల్లో వాడడానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ఒకవవేళ ప్రభుత్వం క్లియరెన్స్ వస్తే ఏపీలోని పలు టూరిస్ట్ కేంద్రాల్లో ఇకపై వాటర్ డ్రోన్ లు దర్శనం ఇవ్వనున్నాయి .