విశాఖపట్నం: వచ్చే ఎన్నికలు మాజీ సీఎం చంద్రబాబుకే కాదు.. తెలుగుదేశం పార్టీకీ సైతం చివరి ఎన్నికలు అవుతాయని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఎన్నికలు తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు నాయుడు ప్రకటించడం వల్ల ఎవరికి నష్టమని ప్రశ్నించారు. 2019 లో తెలుగుదేశం పార్టీ గెలిచి ఉండకపోతే అవే ఆ పార్టీకి, చంద్రబాబుకి ఆఖరి ఎన్నికలు అయి ఉండేవని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. 
తెలుగుదేశం పార్టీకి ఆ సత్తా ఉందా ?
2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లోనూ, 25 లోక్ సభ సీట్లలోనూ తెలుగుదేశం పార్టీ పోటీ చేయగలిగే సత్తా ఉందా? అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని పదేపదే చెప్పుకునే చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రానికి ఏం మేలు చేశారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా పని చేసిన సమయంలో కనీసం గుంటూరు, విజయవాడ నగరాలను కూడా అభివృద్ధి చేయలేకపోయారని, కేవలం ఆయన, అనుయాయుల భూములు ఉన్న అమరావతిని మాత్రమే అభివృద్ధి చేసుకోవాలన్న దిశగా చంద్రబాబు పాలన కొనసాగించాలని అమర్నాథ్ ఆరోపించారు. మూడు రాజధానులు పేరుతో ఉత్తరాంధ్ర, రాయలసీమను కూడా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పించారని, దానిని అడ్డుకునేందుకు చంద్రబాబు పలు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.
పుట్టి పెరిగిన ప్రాంతం అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు !
చంద్రబాబు రాయలసీమ పర్యటనలో చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వము, రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని అమర్నాథ్ చెప్పారు. రాయలసీమ (కర్నూలు)కు హైకోర్టు ఇస్తామంటే వద్దంటూ అడ్డం పడుతున్న చంద్రబాబు గురించి ఏమనుకోవాలని ఆయన ప్రశ్నించారు. రాయలసీమలో పుట్టి, పెరిగిన చంద్రబాబు ఆ ప్రాంత అభివృద్ధికి ఏమీ చేయకపోగా, అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాయలసీమ పర్యటనలో చంద్రబాబు మాటలు చూస్తూ ఉంటే ఆయన ఆలోచనతో మాట్లాడుతున్నారో, అక్కసుతో మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదని అమర్నాథ్ అన్నారు. 
నిరసన తెలపడానికి వచ్చిన వారిని బట్టలు ఊడదీసి కొట్టమని చంద్రబాబు తమ కార్యకర్తలకు చెప్పటం ఆయన అహంకారానికి అర్థం పడుతుందన్నారు. "మీకు చెప్పు చూపించాలని ఉంది" అంటూ ఆయన అధికార పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడటం చూస్తే ఆయన ఫ్రస్టేషన్లో ఉన్నట్టు అర్థం అవుతుందని అన్నారు. చంద్రబాబు ఆయన పార్ట్‌నర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి చేస్తున్న అసందర్భ వ్యాఖ్యలను రాయలసీమ ప్రజలే తప్పు పడుతున్నారని, ఆయన తన పద్ధతి మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని మంత్రి అమర్నాథ్ హెచ్చరించారు.


Also Read: AP Chance Politics : ఒక్క చాన్స్, సెకండ్ చాన్స్, లాస్ట్ చాన్స్ - ఏపీలో ఈ మూడింటిలో మీ ఓటు


Chandrababu Last Elections :   వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే .. ఇవే తనకు చివరి ఎన్నికలను చంద్రబాబు కర్నూలు టూర్‌లో ప్రకటించారు. పార్టీ కార్యకర్తలు, భారీగా తరలి వచ్చిన జన సందోహం మధ్యనే ఆయనీ ప్రకటన చేశారు. వెంటనే ఏపీ రాజకీయాల్లో ఒక్క సారిగా కలకలం ప్రారంభమయింది. తెలుగుదేశం పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు భిన్న కోణాల్లో అన్వయించుకుని ప్రకటించుకుంటున్నారు. చర్చించుకుంటున్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ఈ అంశంపై గుంభనంగా వ్యవహరిస్తున్నారు. తమకు కావాల్సింది ఇతర అన్ని చోట్లా చర్చ జరగడమేనన్నట్లుగా ఉన్నారు.