AP Chance Politics :   ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. ప్రజల వద్దకు అన్ని పార్టీలు అగ్రెసివ్‌గా వెళ్తున్నాయి. తమ నినాదాలను ఖరారు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మూడు పార్టీలు హోరాహోరీగా తలపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మూడు రాజకీయ పార్టీల్లో జనసేన పార్టీ ఒక్క చాన్స్ అడుగుతోంది.. వైఎస్ఆర్‌సీపీ రెండో చాన్స్ అడుగుతోంది..  టీడీపీ అధినేత చంద్రబాబు చివరి చాన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు ఈ అంశంపైనే రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎజెండా కూడా ఇదే అయ్యే అవకాశం ఉంది. 


గెలవకపోతే వచ్చే ఎన్నికలే చివరివని తేల్చేసిన చంద్రబాబు !


చంద్రబాబునాయుడు కర్నూలులో వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించి సీఎంగా పంపించకపోతే ఇక రాజకీయాల్లో ఉండనని ప్రకటించారు. ఆయన అసెంబ్లీలో సవాల్ చేసిన అంశం గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి సందర్భంలో చేసినా..  చంద్రబాబు అన్న మాటలు మాత్రం ప్రజల్లోకి వెళ్లిపోయాయి. దీనికి వైఎస్ఆర్‌సీపీకి కూడా ఓ కారణం. ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే ఇక చంద్రబాబు యాక్టివ్‌గా ఉండలేరని... మనమే 30 ఏళ్ల పాటు సీఎంగా ఉంటామని జగన్ పార్టీ క్యాడర్‌కు చెబుతున్నారు. అంటే వారు కూడా చంద్రబాబు గెలవకపోతే.. ఇవే చివరి ఎన్నికలన్న సందేశం ఇస్తున్నారు. చంద్రబాబు కూడా అదే చెబుతున్నారు. ఓ రకంగా ప్రజల నుంచి సానుభూతి  పొందే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు అంటున్నాయి. ఏదైనా రాజకీయ వ్యూహమే. ఎలా చూసినా.. చంద్రబాబు తనకు చివరి చాన్స్ ఇవ్వాలని.. రాష్ట్రాన్ని బాగు చేస్తానని అంటున్నారు. 


రెండో చాన్స్ కావాలంటున్న జగన్ !


ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ ఓటర్లను అడిగి భారీ స్థాయిలో మద్దతు పొందిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెండో సారి పదవి నిలబెట్టుకోవాలని తాపత్రయ పడుతున్నారు. ప్రజలందరికీ ముఖ్యంగా మెజార్టీ ప్రజలకు పథకాల లబ్ది చేకూరుస్తున్నామని వారంతా ఖచ్చితంగా ఓట్లేస్తారని నమ్ముతున్నారు. అందుకే .. ఎమ్మెల్యేలను ఇంటింటికి పంపి.. తమ ప్రభుత్వం వచ్చాక.. ఇచ్చామంటూ రూ. లక్షల వివరాలు చెబుతున్నారు. అదే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వలేదని.. మళ్లీ చంద్రబాబు వస్తే అన్నీ ఆపేస్తారని చెబుతున్నారు. పార్టీ నేతలతో జరుగుతున్న సమావేశాల్లో కూడా తాను బటన్ నొక్కడం సక్రమంగా చేస్తే చాలని.. మిగతా పని ఎమ్మెల్యేలు పూర్తి  చేయాలని అంటున్నారు. రెండో చాన్స్ తనకు వస్తుందని..ఆయన గట్టిగా నమ్ముతున్నారు. 


ఒక్క చాన్స్ అడుగుతున్న పవన్ కల్యాణ్ !


జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఒక్క చాన్స్ ఇవ్వడం రాష్ట్రం రాత మార్చేస్తానన్న స్లోగన్ వినిపించడం ప్రారంభించారు. ఆయన సోదరుడు ప్రజా రాజ్యం పార్టీ పెట్టి తెచ్చుకున్న ఓట్లలో జనసేన పార్టీ సగం మాత్రమే తెచ్చుకుంది. అయిన్పటికీ గత ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో  ఒంటరిగా పోటీ చేస్తారా లేదా పొత్తులా అన్నదానిపై స్పష్టత లేదు. ఓట్ల చీలికను నివారిస్తామని పవన్ చెబుతున్నారు. అయితే మోదీని కలిసిన తర్వాత మాత్రం... ఒక్క చాన్స్ అనే వాదన వినిపిస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్ ఒంటరి పోటీకి మొగ్గు చూపుతున్నారని ఎక్కువ మంది భావిస్తున్నారు. జగన్, చంద్రబాబు పాలన చూశారని.. ఫ్రెష్‌గా ఓ సారి పవన్‌కు చాన్సిద్దామని ప్రజలు అనుకుంటే పట్టం కడతారని జనసేన వర్గాలు అనుకుంటున్నాయి. అంత స్కోప్ ఉందా లేదా అన్న సంగతి పక్కన పెడితే. .. ఒక్క చాన్స్ అనే నినాదం కాస్త పవర్ ఫుల్‌గా ఉందని జనసేన వర్గాలు నమ్ముతున్నాయి. 


ఏపీలో ఎలా చూసినా... ప్రజలకు వన్ , టు , త్రీ చాన్సులు ఉన్నాయి. ఆ చాయిస్‌లోనే ప్రజలు తమ పాలకుడ్ని వచ్చే ఎన్నికల్లో ఎంచుకోవాల్సి ఉంది.