విశాఖలో ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ కాదు జె సమ్మిట్ అని, జగన్ విశాఖలో ఉన్నంత కాలం ఉత్తరాంధ్ర వాసులకు కంటిమీద కునుకు లేదు అని టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఎక్కడ, ఎవరి భూములు దోచుకుంటారనే భయంతో అక్కడి వారు నిద్ర పోలేదని.. నాలుగేళ్ల పాలనలో దోచుకున్న ధనాన్ని పెట్టుబడులు రూపంలో మార్చడానికే ఈ సమ్మిట్ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ మృతికి రిలయన్స్ కారణమని గతంలో ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు అదే రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీతో జగన్ ఫ్రెండ్ షిప్ ఏలా చేస్తున్నారని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.


విశాఖలో నిర్వహించింది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కాదని, జే సమ్మిట్ అన్నారు. దోచుకున్న భూముల్ని స్వంతం చేయడానికే ఈ జె సమ్మిట్ నిర్వహించారని, ఇలా దోచుకోవచ్చన్న విషయం దేశంలో ఎవరికి తెలియదు అంటూ సీఎం జగన్ పై బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు. విశాఖలో నిర్వహించిన సమ్మిట్ కి వందల కోట్లు ఖర్చు చేశారని, ఆ ఖర్చులో కూడా కొట్టేయడమే జగన్ లక్ష్యం అని.. ఇలాంటి వాటిలో జగన్ మైండ్ మాస్టర్ మైండ్ అని టీడీపీ నేత ఆరోపించారు.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ కి గుణపాఠం చెప్పాలని పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారు. అందులో ముందు వరుసలో టీచర్లున్నారని బుద్ధా వెంకన్న అభిప్రాయపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇదివరకే బెదిరింపులు మొదలుపెట్టారని, కానీ మీరు ఎవరికి భయపడాల్సిన పరిస్థితి లేదన్నారు. గతంలో జగన్ కు విజయవాడ, BRTS రోడ్డులో టీచర్లు తమ సత్తా చూపారని, ఇదే తీరుగా వచ్చే ఎమ్మెల్సి ఎన్నికల్లో అదే స్పూర్తితో వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్ అని, ఈ ఎన్నికల్లో సీఎం జగన్ కు బుద్ధి చెప్పాలని టీడీపీ నేత కోరారు.


లోకల్ ఫేక్ సమ్మిట్‌గా అభివర్ణించిన లోకేష్
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను లోకల్ ఫేక్ సమ్మిట్‌గా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇటీవల అభివర్ణించారు. ఎందుకంటే ఆ సమ్మిట్‌లో ఒక్కటి కూడా అంతర్జాతీయ కంపెనీ లేదని విమర్శించారు. ప్రభుత్వం కంపెనీలతో ఒప్పందాలు, పెట్టుబడులు పెట్టే సమయంలో ఆయా పేపర్లపై సంతకాలు చేసి, మీడియాకు చూపిస్తామని, ఈ సమ్మిట్‌లో అలాంటిదేమీ జరగలేదని చెప్పారు. ముఖేష్ అంబానీ విషయంలోనూ కనీసం పుస్తకం తెరిచి సంతకాలు జరగలేదని చెప్పారు. సంతకాలు, పత్రాలు, పేర్లు లేకుండా చీకటి ఎంవోయూలు చేశారని లోకేశ్ అన్నారు. పీలేరులో నిర్వహించిన మీడియా సమావేశంలో లోకేశ్‌ మాట్లాడారు. 


378 కంపెనీలతో ఎంఓయూలు జరిగాయని చెప్పుకుంటుండగా, 70 వరకూ కంపెనీలవి మాత్రమే బయటపెట్టారని విమర్శించారు. గతంలో చంద్రబాబు హాయంలో అందుకోసం ఓ ప్రత్యేక వెబ్ సైట్ ఉండేదని, అందులో ఏ కంపెనీ ఏ స్థాయిలో ఉండేదని వివరించారు. ఇప్పుడు ఆ సౌకర్యాన్ని తీసేశారని చెప్పారు. ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోందని పారిశ్రామిక వేత్తలు చెప్పారని నారా లోకేశ్‌ అన్నారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు నిల్‌.. గంజాయి ఫుల్‌ అన్నట్లు పరిస్థితి తయారైందని విమర్శించారు.